దేనికైనా టైమ్ రావాలి అని మనవాళ్లు అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ టైమ్ కే టైమ్ వచ్చినట్టుంది. అందుకే టైమ్ చిత్రాల హవా మళ్లీ మొదలైంది. కాల మహిమ అంటే అదేనేమో.. కాలం ఎవరి కోసమూ ఆగదు కదా. బ్రో సినిమాలో టైమ్ అనే పాత్ర పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడి రూపంలోనే దిగి వచ్చాడు.
కాలమే భగవంతుడు అని భగవద్గీతే అంటోంది. కాకపోతే తెలుగు సినిమాల్లో కాల చైతన్యం రావడమే గొప్ప విషయం. ఆ ఘనత మన తెలుగులో దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావుకే దక్కుతుంది. టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ మీద వచ్చిన తొలి తెలుగు చిత్రం ఆదిత్య 369. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.191 ఆగస్టు 18న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా చూసి జనం ఔరా అంటూ విస్తుపోయారు.
అసలు ఇలాంటి చిత్రాలకు స్ఫూర్తి హెచ్.జి. వెల్స్ రాసిన టైమ్ ట్రావెల్ అనే పుస్తకం. దీని సాధ్యాసాధ్యాలు అటుంచితే హాలీవుడ్ ముందుగా ఇలాంటి చిత్రాల మీద దృష్టిసారించి కోట్లకు కోట్లు పోగేసుకుంది. మొట్టమొదటి టైమ్ ట్రావెల్ చిత్రం హాలీవుడ్ లో 1960లోనే వచ్చింది. అదే ది టైమ్ మెషీన్. ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్ కు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఆతర్వాత ఎన్నో చిత్రాలు హాలీవుడ్ లో ఈ సబ్జెక్ట్ మీద తెరకెక్కాయి. సినిమాల విషయం పక్కన పెడితే అసలు ఈ విశ్వంలో టైమ్ ట్రావెల్ సాధ్యమేనా అనేది ఇంకో ప్రశ్న. దీనికి సమాధానం ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లాంటి వారే చెప్పాలి.. చెప్పారు కూడా.
ఏమిటీ టైమ్ ట్రవెల్?
టైమ్ ట్రావెల్ చేసి జరిగిపోయిన కాలంలోకి, భవిష్యత్తులోకి ప్రయాణించడం. గతంలోకి ప్రయాణించడమంటే మనం నిన్నటి కాలంలోకి వెళ్లడం. ఓ 24 గంటలు వెనక్కి వెళ్తే గతంలోకి వెళ్లినట్లే. అదే 24 గంటలు ముందుకి వెళ్తే భవిష్యత్తులోకి వెళ్లినట్లే. గతం గత: అంటూ ఉంటాం. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లడం లాంటిది కాదిది. ఎలా వెళ్లాలో తెలిస్తే జవాబు తెలిసినట్టే.కాలం ఉన్నదని మనకు తెలుసు.. దాన్ని అధిగమించడం మాత్రం మన చేతుల్లో లేదు. చనిపోయిన వ్యక్తిని మనం కాలం చేశాడు అంటూ ఉంటాం. అంటే అతను కాలగర్భంలో కలిసిపోయాడు. ఫాంటసీతో థ్రిల్ చేసి సినిమాలు చేయడానికి మాత్రం ఈ టైమ్ ట్రావెల్ బాగా ఉపకరిస్తుంది. అందుకే హాలీవుడ్ తర్వాత అటు బాలీవుడ్, ఇటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు కూడా సినిమాలు చేసేస్తున్నాయి.
టైమ్ ట్రావెల్, టైమ్ లూప్..
టైమ్ ట్రావల్ మాత్రమే కాదు టైమ్ లూప్ తోనూ సినిమాలు వస్తున్నాయి. టైమ్ ట్రావెల్ అంటే ఏంటో తెలుసు.. మరి టైమ్ లూప్ ఏంటి అన్న సందేహం వస్తుంది. జీవితం రిపీట్ అవడమే టైమ్ లూప్. జరిగిందంతూ ఓ కలలా అనిపిస్తుంది. అవే పాత్రలు పునరావృతమవుతుంటాయి. ఇటీవలే కుడిఎడమైతే అనే వెబ్ సిరీస్ ఇలానే తెరకెక్కింది. అలాగే విజయ్ హీరోగా రూపొందిన ఓ సినిమా మానాడు పేరుతో తెలుగులోకి కూడా అనువాదమైంది. కన్నడంలో డెజావు అనే సినిమా కూడా ఈ తరహా కథే.
ఇక మన టైమ్ ట్రావెల్ చిత్రాల విషయానికి వస్తే తమిళ హీరో మూడు పాత్రలు పోషించిన 24 చిత్రం కూడా ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. విక్రమ్ కె కుమార్ దీనికి దర్శకుడు. కళ్యాణ్ రామ్ బింబిసార ఈ తరహాలో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. అద్భుతం, ప్లే బ్యాక్, అ, ఒకే ఒక జీవితం, 7.11 పీఎం లాంటి చిత్రాలు ఈ తరహాలోనే రూపొందాయి.
భవిష్యత్తులోకి చేరే కథాంశంతో నాగ్ అశ్విన్ కల్కిని తెరెకెక్కిస్తున్నారు. టైమ్ ట్రావెల్ చిత్రాలు తీయాలంటే చాలా తెలివితేటలు ఉండాలి, దాంతోపాటు సైంటిఫిక్ నాలెడ్జి ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి చిత్రాల్లో లాజిక్ మిస్సవకూడదు. సైన్స్ ఫిక్షన్లు, చందమామ కథలూ మనందరికీ ఇష్టమే. ఎందుకంటే అవి మనల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మనమే టైమ్ ట్రావెల్ చేసిన భావనను కల్పిస్తాయి. ఆ ఊహాలోకంలోకి నిజంగానే వెళ్లగలిగితే అదో అద్భుతమే.