(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
సభ్యసమాజం తలదించుకునేలా విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి గ్రామంలో అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన పోలిపల్లి దుర్గారావు (19) గురువారం అత్యాచారం జరపడం జిల్లాలో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని వెంటనే శిక్షించాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి , విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి పూసపాటి అధితి గజపతిరాజు, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నం నాయుడుతో కూడిన తెలుగుదేశం పార్టీ బృందం స్థానిక ఘోషాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని, వారి కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు.
ప్రభుత్వ వైఫల్యం
ఈ సందర్భంగా టీడీపీ బృందం మీడియాతో మాట్లాడుతూ దిశ చట్టం అమలులో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే వరుస అత్యాచారాలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో నానాటికీ చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతుండడం దారుణమన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు తిరిగి చోటుచేసుకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్రోతు బంగార్రాజు, కంది చంద్రశేఖర్, సువ్వాడ రవిశేఖర్, పతివాడ తమ్మినాయుడు, అనురాధా బేగం తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- పార్టీ తీరుపై నోరు జారుతున్న సొంత ఎమ్మెల్యేలు.. ఇరకాటంలో వైసీపీ











