సకాలంలో పట్టా పాసు పుస్తకాలు ఇవ్వలేదనే కారణంతో… ఓ రైతు తహసీల్దార్ పై డీజిల్ దాడి చేసిన సంఘటన సంచలనం కలిగించింది. మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. శివ్వంపేట పరిధిలోని తాళ్లపల్లి తండాకు చెందిన రైతు మాలోతు బాలు సోమవారం విద్యుత్ షాక్ తో చనిపోయాడు. అతనికి వ్యవసాయ భూమి ఉన్నా.. దానికి సంబంధించిన పట్టాపాస్ పుస్తకాలు మంజూరు కాలేదు. పట్టాబుక్ లు లేని కారణంగానే రైతుకు బీమా అందలేదని కుటుంబసభ్యులు, రైతులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అయినా… తహసీల్దార్ భానుప్రకాశ్ పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన ఓ రైతు డీజిల్ పోశాడు. దీంతో అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చచెబుతున్నారు.
గతంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో పెట్రోల్ దాడి జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ రైతు పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ ఘటనలో తహసీల్దార్ తో పాటు ఓ రెవెన్యూ ఉద్యోగి, రైతు చనిపోయాడు. ఈ ఘటనపై ఎన్నో భినాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అప్పట్నుంచే ఈ తరహా దాడులు ఎక్కువయ్యాయి. విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే, రైతులు పెట్రోల్, డీజిల్ దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు అంతటా వినిపిస్తున్నాయి.
Must Read ;- వడ్లు అమ్మటానికి అష్ట కష్టాలు.. అమ్మినా డబ్బులందక రైతుల గగ్గోలు