ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతలకు లోనయ్యారు. ఆయన నిన్న న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్వాస సంబంధ సమస్యతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఆయన పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి.
సిరివెన్నెల చిత్రం రాసిన పాటలతో సిరివెన్నెల అనేది ఆయన ఇంటి పేరుగా మారింది. భావ గర్భితమైన పాటలకు ఆయన పెట్టింది పేరు. గీత రచయితగా తొలి సినిమా సిరివెన్నెల చిత్రంలో అలాంటి పాటలే ఉంటాయి. విరించినై విరచించితిని, విధాత తలపున ప్రభవించినది.. లాంటి పదప్రయోగాలు ఎన్నో ఆయన చేశారు. దాదాపు 36 ఏళ్ల సినీ ప్రస్థానంలో వేలాది పాటలు ఆయన రాశారు. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్పత్రిలో చేరారనగానే ఆయన అభిమానులు ఆందోళన చెందారు.
‘ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు’ కిమ్స్ వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. నిన్న ఆయన ఆస్పత్రిలో చేరారన్న వార్త బయటికి వచ్చిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు కూడా స్పందించారు. ఆయనకు ఏమీ కాలేదని స్వల్ప ఆస్వస్థతతో మాత్రమే ఆస్పత్రిలో చేరారని వెల్లడించారు. అయితే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఈరోజు వైద్యులు ప్రకటించారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Must Read ;- కరోనాతో ఆస్పత్రిలో ఉన్న శివశంకర్ మాస్టర్ కన్నుమూత











