షావుకారు జానకి .. వెండితెరపై వెన్నెల మూట. మనసు తెరపై మధురమైన పడుచుపాట. అంకితభావానికి ఆమె పర్యాయపదం .. పట్టుదలకు ఆమె ప్రత్యామ్నాయం. సాధన .. సంకల్పం .. సహనం .. సాహసం కలిస్తే ‘షావుకారు’ జానకి అవుతుంది. ఆకాశమంతటి ఆత్మవిశ్వాసానికి ఆనవాలుగా నిలుస్తుంది. ఆమె కళ్లు మాట్లాడతాయి .. పోట్లాడతాయి .. పాటలు పాడతాయి .. పోటీలుపడతాయి. నవరసాలను నయనాల్లో దాచుకుని అవసరమైనప్పుడు అద్భుతంగా ఆవిష్కరించడం ఆమె ప్రత్యేకత. ఇక ఆమెలో దాగిన మరో విశేషం .. వాయిస్. అవును ‘షావుకారు’ జానకి వాయిస్ లోని ప్రత్యేకత .. డైలాగ్స్ చెప్పే తీరు .. ఆమె కెరియర్లో ప్రధానపాత్రను పోషించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఓ మాట్లాడే కోయిల.
షావుకారు జానకి ‘రాజమండ్రి‘లో పుట్టిపెరిగింది. అందువల్లనేనేమో ఆమె ఓ గడుసు గోదావరిలా కనిపిస్తుంది .. ఆ గలగల ల్లోని కొంటెదనం ఆమె వాయిస్ లో వినిపిస్తుంది. ఆ వాయిస్ కారణంగానే తొలినాళ్లలో రేడియో నాటకాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ వాయిస్ విన్న బీఎన్ రెడ్డి ఆమెను చూసేందుకు రేడియో స్టేషన్ కి వచ్చారంటే, ఆమె వాయిస్ కి గల ఆకర్షణ శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలా ఆమెను చూసిన బీఎన్ రెడ్డి, ‘షావుకారు’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అప్పటికీ .. ఇప్పటికీ ఓ సంచలనమే. ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించిన దగ్గర నుంచి ‘షావుకారు’ అనేది జానకి ఇంటిపేరుగా మారిపోయింది.
విజయ ప్రొడక్షన్స్ .. నిర్మాతలుగా నాగిరెడ్డి – చక్రపాణి .. దర్శకుడిగా ఎల్.వి. ప్రసాద్ .. ఈ కాంబినేషన్ లో ‘షావుకారు’ చేయడమనేది సాధారణమైన విషయమేం కాదు. ఇక ఇదంతా ఒక ఎత్తయితే .. గోవిందరాజుల సుబ్బారావుతో కలిసి నటించడం మరో ఎత్తు. తొలితరం నటుల్లో సహజనటుడిగా తనదైన మార్కు చూపిన గొప్ప నటుడు ఆయన. అలాంటి ఆయన చుట్టూ ‘మావయ్యా .. మావయ్యా’ అంటూ తిరిగే పాత్రలో జానకి జీవించారు. పల్లెటూరి పడుచులా కళ్లతోనే ఆమె చేసిన విన్యాసాలు .. ఒలికించిన నయగారాలు .. పలికించిన సరస చమత్కారాలు చూసి తీరవలసిందే.
‘షావుకారు’ సినిమా తరువాత జానకి మరిన్ని మంచి అవకాశాలను .. విజయాలను అందుకున్నారు. ‘పిచ్చిపుల్లయ్య’ .. ‘రోజులు మారాయి’ .. ‘సొంతవూరు’ .. ‘కన్యాశుల్కం’ సినిమాలు జానకి నటనాపటిమకు నిలువుటద్దమై నిలిచాయి. ముఖ్యంగా ‘కన్యాశుల్కం’ సినిమాలో జానకి పోషించిన ‘బుచ్చమ్మ’ పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఒక వైపున సంప్రదాయం పేరుతో కుటుంబసభ్యుల చేతలు, మరో వైపున మార్పు దిశగా అడుగులు వేయమనే ‘గిరీశం’ మాటలకి మధ్య నలిగిపోయే అమాయకురాలైన ‘యంగ్ విడో’ పాత్రలో ఆమె నటనను అభినందించకుండా ఉండలేం. ఇక ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ సినిమాలో ‘ఎరుకల సాని’ పాత్రలో జానకి ఒదిగిపోయిన తీరు అసమానం. పద్మావతీదేవికి ‘సోదె’ చెప్పే సన్నివేశంలో ఎరుకల సాని ‘యాస’ను జానకి తప్ప మరెవరూ అంతలా పలికించలేరేమో.
‘షావుకారు’ జానకి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ‘మంచి మనసులు’ .. ‘డాక్టర్ చక్రవర్తి’ .. ‘అక్కా చెల్లెళ్లు’ కనిపిస్తాయి. ‘మంచి మనసులు’లో అంధురాలిగా .. ‘డాక్టర్ చక్రవర్తి’లో భర్తను అపార్థం చేసుకునే అహంభావం కలిగిన శ్రీమంతురాలిగా ఆ పాత్రల్లో ఆమె చూపిన నటన హృదయానికి హత్తుకుపోతుంది. ఆ తరువాత కాలంలో ఆమె చేసిన ‘తాయారమ్మ బంగారయ్య’ .. ‘సంసారం ఒక చదరంగం’ సినిమాలు కూడా జానకి కెరియర్లో జాతిరత్నాలుగా కనిపిస్తాయి. ‘సంసారం ఒక చదరంగం’ సినిమాలో పనిమనిషి ‘చిలకమ్మ’ పాత్రలో జానకి చేసిన హావభావ విన్యాసం .. ఆ పాత్రకి తగిన ‘యాస’తో ఆమె చెప్పిన సుదీర్ఘమైన సంభాషణలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
ఇలా మరిచిపోలేని మంచి ముత్యాలవంటి పాత్రలు ఎన్నో ఆమె చేశారు. మోడ్రన్ మదర్ గా .. మోడ్రన్ బామ్మగా కనిపిస్తూనే వస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాదు .. తమిళ .. కన్నడ భాషల్లోను తన జోరు చూపించారు. తెలుగులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన ఆమె, తమిళంలో ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ .. జెమినీ గణేశన్ తో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. తెలుగులో కంటే తమిళంలోనే ఆమెకి ఎక్కువ ఆదరణ లభించడం విశేషం. ఇలా వివిధ భాషల్లో ఆమె ఇంతవరకూ 375 సినిమాలకి పైగా చేయగలిగారు.
ఆమె తెలుగు పాటల్లో ‘ఓహో ఓహో పావురమా’ ముందువరుసలో నిలుస్తుంది. ఒక పావురాన్ని మరో పావురం ఎగరేస్తుందా? అన్నంత నాజూకుగా ఆమె తెరపై కనిపిస్తుంది. ‘నిజం చెప్పవే పిల్లా’ .. ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి పాటలు, నిజమైన నటనకు నిర్వచనం చెబుతాయి.
తెలుగులో సావిత్రి .. జమున .. బి.సరోజాదేవి .. తన చెల్లెలు కృష్ణకుమారి గ్లామర్ పరంగా కూడా దూసుకెళుతున్న సమయంలో, ఆ స్థాయి గ్లామర్ లేకపోయినా కేవలం అభినయం .. వాచకంతో తన కెరియర్ ను పరుగులు తీయించిన
ప్రతిభ ‘షావుకారు’ జానకి సొంతం. తన బలమేమిటో .. బలహీనత ఏమిటో ‘షావుకారు’ జానకికి తెలుసు. ఆ బలాన్ని మరింత పెంచుకోవడం కోసమే ఆమె నిరంతరం సాధన చేశారు .. సీనియర్ ఆర్టిస్టులు సైతం తన ఎదురుగా నిలబడి డైలాగ్స్ చెప్పడానికి తడబడేలా చేశారు. వాచకం ద్వారా నటుల్లో ‘కొంగర జగ్గయ్య’ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటే, నటీమణులలో ‘షావుకారు’ జానకి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
‘పిట్టకొంచెం కూత ఘనం’ అనే సామెత ‘షావుకారు’ జానకికి పూర్తిగా వర్తిస్తుంది. ఉన్నతమైన వ్యక్తిత్వమే ఆమెను విజేతగా నిలబెట్టింది. ఎన్నో అవమానాలు .. మరెన్నో తిరస్కారాలు .. చేజారిన అవకాశాలు .. చేదు అనుభవాలు ఆమె కెరియర్లో కనిపిస్తాయి. అయినా ఆమె కుంగిపోలేదు .. కుమిలిపోతూ కూర్చోలేదు. ఆమెకి ఓడిపోవడం తెలియదు .. ఓటమిపై ఒంటరిగా పోరాడటమే తెలుసు. భయపడటం తెలియదు .. ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో భయాన్ని భయపెట్టి తరిమేయడమే తెలుసు.
‘నీ కష్టమే నీ కన్నీళ్లు తుడుస్తుంది .. నీ సంకల్పమే నిన్ను గెలిపిస్తుంది’ అనే మాటను అక్షరాలా ఆచరణలో పెట్టి ఆకాశమంత ఎదిగిన తీరు ‘షావుకారు’ జానకిలో కనిపిస్తుంది. ద్వేషానికి దూరంగా .. ధైర్యానికి దగ్గరగా మసలుకుంటూ, ప్రేమించడం .. క్షమించడం తెలిసిన గొప్పవ్యక్తిత్వానికి ‘షావుకారు’ జానకి కొలమానం. ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆమెకి ‘ది లియో న్యూస్’ శుభాకాంక్షలు అందజేస్తోంది.
Also Read: savitri
— పెద్దింటి గోపీకృష్ణ