దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు, జీహెచ్ఎంసీలో పార్టీ గణనీయ స్థాయిలో సీట్లు గెలుచుకోవడంతో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పలువురు నాయకులను చేర్చుకుంటున్న బీజేపీ.. మరి కొందరికి గాలం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నేత, మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, కాంగ్రెస్ నేత మాజీ మేయర్ కార్తీకరెడ్డిలు బీజేపీలో చేరారు. తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ డీలా పడిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి కూడా లీడర్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతుండగా టీఆర్ఎస్‌లోని లీడర్లను కూడా చేర్చుకునేందుకు సిద్ధమైంది.
మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా..
తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీలోకి వెళ్లడం దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. శుక్రవారం ఎమ్మెల్యే కాలనీలో చంద్రశేఖర్ ఇంటికి వెళ్లిన డీకే అరుణ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు చంద్రశేఖర్. తరువాత టీఆర్ఎస్‌కి వెళ్లారు. గతంలో కేసీఆర్‌తో సత్సంబంధాలు కలిగిన కీలక నేతగా ఆయనకు పేరుంది. కేసీఆర్ వ్యూహాల్లోనూ చంద్రశేఖర్ పాత్ర ఉందని అప్పటి నాయకులు చెబుతారు. దళితుడిని సీఎం చేస్తానని తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అప్పట్లోనే చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం పరిణామాలు మారాయి. కేసీఆర్‌కి, చంద్రశేఖర్‌కి మధ్య గ్యాప్ పెరిగింది. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. వికారాబాద్ ఏరియాలో గట్టి పట్టున్న నేతగా చంద్రశేఖర్ కి పేరుంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మాత్రమే పాల్గొంటున్నారు. పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదనే అభిప్రాయంతో ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత డీకే అరుణ ఆయన ఇంటికి వెళ్లి బీజేపీలోకి ఆహ్వానించారు. ఆయన సుముఖత వ్యక్తం చేశారని, వికారాబాద్‌లో లేదా సమీప ప్రాంతంలో భారీ సభ ఏర్పాటు చేసి పార్టీలోకి వస్తారని సమాచారం. కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.
ఠాకూర్‌తో కొండా దంపతుల భేటీ..
వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలు కొండా మురళి, కొండా సురేఖలు కూడా బీజేపీలోకి వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా కొండా మురళి, అదే జిల్లాకు చెందిన మరో నేత మురళీధర్‌లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాకూర్‌తో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై చర్చించారు. త్వరలోనే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నందున ఆ ఎన్నికలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఠాగూర్‌ను కొండా దంపతులు కలవడంతో బీజేపీలోకి వెళ్తారనే ప్రచారానికి తెరపడినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను, టీఆర్ఎస్‌ను బలహీనం చేసేందుకు వచ్చే ఏ అవకాశాన్ని కూడా బీజేపీ వదిలేలా లేదనే చర్చ నడుస్తోంది.
Also Read: నాగార్జునసాగర్‌పై బీజేపీ కన్ను.. పట్టున్న నాయకుడిని పట్టే ఆలోచన