వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలకమంత్రుల్లో ఒకరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వైరం పెట్టుకున్న జడ్జి రామకృష్ణ అరెస్టు అయ్యారు. జడ్జి రామకృష్ణను ఆయన కొడుకు వంశీకృష్ణను కలిపి చెక్కుల ఫోర్జరీ కేసులో అరెస్టు చేశారు. కోర్టు వీరికి రిమాండు విధించింది. ప్రస్తుతం తండ్రీ కొడుకులను పీలేరు సబ్ జైలుకు తరలించారు.
జడ్జి రామకృష్ణ సుదీర్ఘకాలంలో ప్రభుత్వంలోని పెద్దలతో పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల మీద ఆయన పలుమార్లు ఫిర్యాదులు చేశారు. భూకబ్జా వ్యవహారాలకు సంబంధించి వీరి మధ్య తీవ్రమైన వైరం నెలకొంది. జడ్జి రామకృష్ణ మీద, ఆయన సోదరుడు రామచంద్ర మీద కూడా గతంలో దాడులు జరిగాయి. తిరుపతిలో నిరసన ప్రదర్శనలకు పూనుకున్న సమయంలో.. రామకృష్ణను పోలీసులు నిర్బంధించారు. తనకు అన్యాయం జరిగిందంటూ.. రామకృష్ణ ఫిర్యాదు చేయబోతే.. తిరుపతి పోలీసులు కనీసం ఆ ఫిర్యాదును కూడా స్వీకరించలేదు. పెద్దిరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదంటూ రామకృష్ణ పలుమార్లు ఆరోపణలు చేశారు. గతంలో ఆయనను రోడ్డు మీదికి రావొద్దంటూ తహశీల్దార్ ఆదేశాలిస్తే.. ఆయన హైకోర్టుకు వెళ్లి.. ఆ ఉత్తర్వులను రద్దు చేయించుకున్నారు.

ప్రభుత్వంతో ఇంతగా పోరాడుతున్న జడ్జి రామకృష్ణను మదనపల్లె పోలీసులు ఒక సాధారణమైన చెక్కు ఫోర్జరీ కేసులో అరెస్టు చేయడం గమనార్హం. ఇది ఎలా జరిగిందంటే..
జడ్జి రామకృష్ణ పిన్ని సుచరిత పెన్షనరు. ఆమె ఇటీవలి కాలంలో మరణించారు. అయితే ఆమె బ్యాంకు ఖాతాలోని సొమ్ము కాజేయడానికి జడ్జి రామకృష్ణ ఆయన కుమారుడు వంశీకృష్ణ ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకులో సబ్మిట్ చేశారనేది ఆరోపణ. బ్యాంకును, ప్రభుత్వ ఖజానాను ఫోర్జరీ సంతకాలతో మోసం చేయడానికి ప్రయత్నించారనేది అభియోగం. ఈ మేరకు మదనపల్లె కెనరా బ్యాంకు మేనేజర్ ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
కక్ష సాధింపులో కొత్త టెక్నిక్కా..?
జడ్జి రామకృష్ణ మీద ప్రభుత్వం కక్ష కట్టిందా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. గతంలో ఆయన మీద దాడులు జరిగిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ, ప్రజాసంఘాలు ఆయనకు అండగా నిలిచాయి. దళితుడైన జడ్జిపై అరాచకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వేధిస్తోందని చంద్రబాబునాయుడు కూడా మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత జడ్జి రామకృష్ణ మీద ప్రభుత్వం మరింత ఫోకస్ పెంచినట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు. వేధింపులకు నిరసనగా ప్రజాసంఘాలు తిరుపతిలో ప్రదర్శన చేయదలచుకున్నప్పుడు.. రామకృష్ణ హోటల్ గదిలోంచి బయటకు రాకుండా నిర్బంధించారు.
Also Read: పేరుకే సమీక్షలు తుది నిర్ణయం జగన్ దే
ఆ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేయబోతే.. పోలీసులు కనీసం కేసు రిజిస్టరు చేసుకోలేదు. నిజానికి, జీరో ఎఫ్ఐఆర్ పేరుతో.. ఏ ప్రాంతం ప్రజలు, మరే ఇతర ప్రాంతంలో పోలీసు స్టేషన్లో కేసు పెట్టదలచుకున్నా.. పోలీసులు తమ పరిధి కాదన చెప్పడానికి వీల్లేదని, జీరో ఎఫ్ఐఆర్‌తో కేసు రిజిస్టరు చేసి తర్వాత సంబంధిత స్టేషనుకు పంపాలని నిబంధనలు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. ఒక జడ్జికే ఇలా కేసు రిజిస్టరు చేయించుకునేందుకు దిక్కులేకపోతే.. ఇక సామాన్యుడి సంగతేంటని అప్పట్లో లియోన్యూస్ ఒక ప్రత్యేక కథనం కూడా అందించింది. ఆ రకంగా జడ్జిని వేధించడంలో భాగంగానే ఇప్పుడు ఈ అరెస్టులు కూడా జరిగినట్లుగా ఉన్నాయని పలువురు అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :