థియేటర్స్ లో సినిమా చూడక ఉసూరుమంటున్న ప్రేక్షకుల కు ఓటీటీ వేదిక ఊరటనిస్తోంది. లాక్ డౌన్ కారణంగా మొన్నటి వరకు సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అక్టోబర్ 15 నుండి సినిమా థియేటర్లను తెరుచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చినా థియేటర్ల యజమానులు, డిస్టిబ్యూటర్లు ముందుకు రావడం లేదు. దింతో నిర్మాతలు ఓటీటీ వేదికల వైపు చూస్తున్నారు.
ఇప్పటికే నాని నటించిన ‘వి’, అనుష్క నటించిన ‘నిశబ్దం’ వంటి పెద్ద సినిమాలు ఓటీటీ ద్వారా సినిమా లవర్స్ ను పలకరించాయి. వీటితో పాటుగా అనేక చిన్న సినిమాలు కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు అదే కోవలోకి ‘రంగమార్తాండ’ సినిమా వచ్చి చేరింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా లాక్ డౌన్ రావడంతో షూటింగ్ నిలిపివేశారు. ఈ మధ్య షూటింగ్ మరలా మొదలైంది.
చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న దర్శకుడు కృష్ణవంశీ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ‘రంగమార్తాండ’ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్. ‘రంగమార్తాండ’తో మరలా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కృష్ణవంశీ చూస్తున్నారు.
ఈ సినిమాను మొదటిగా థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ కరోనా ప్రభావంతో ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లకు వచ్చే పరిస్థితులు లేవు. దింతో సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు నిర్మాతలు. ఈ సినిమా మీద కృష్ణ వంశీ చాలా నమ్మకంతో ఉన్నాడు. ‘రంగమార్తాండ’ చిత్రాన్ని ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తే ఓటీటీను షేక్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ‘రంగమార్తాండ’ సినిమా ప్రేక్షకులను మెప్పించి దర్శకుడు కృష్ణవంశీకి పూర్వ వైభవం తెచ్చిపెడుతుందో లేదో చూడాలి మరి.











