ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది. అది ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎన్నికల ప్రచార కార్యక్రమైనా.. లేదా రైతు వేదికైనా.. కాదేదీ అనర్హం ఆరోపణలు-ప్రత్యారోపణలను చేసుకోవడానికి అన్నట్లుగా ఆ రెండు పార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. జిల్లా అభివృద్ధిలో తమదే క్రెడిట్ అని టీఆర్ఎస్ అంటుంటే, లేదు.. లేదు ఆ క్రెడిట్ కేంద్ర ప్రభుత్వానిదేనని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఈ రకమైన వార్ ఇరు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా రాజుకుంటుంది.
నువ్వా.. నేనా సై..
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ జెండా ఎగిరిన కాన్నుంచి పొలిటికల్ స్టంట్స్‌లో మార్పు వచ్చిందని చెప్పాలి. ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినా టీఆర్ఎస్‌దే ఆ క్రెడిట్ అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంన్నారు. అయితే దానికి ప్రతి విమర్శగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీది కూడా అందులో భాగస్వామ్యం ఉందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన సోయం బాపురావు గెలిచిన తరువాత నుంచి టీఆర్ఎస్ పార్టీ చేసే విమర్శలను ఆయన ధీటుగా ఎదుర్కొంటూ వస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ కూడా రివర్స్ కౌంటర్లను ఇస్తున్నారు. సోషల్ మీడియాను సైతం ఇష్టారీతిన వాడేస్తున్నారు. కౌంటర్లకు ప్రతి కౌంటర్లు వచ్చి అలా పడిపోతున్నాయి. ఎవరికి వారు ప్రత్యేక సోషల్ మీడియా టీంలను పెట్టుకుని తమకు అనుకూలమైన ప్రకటనలను జనంలోకి వదలేస్తున్నట్లు తెలుస్తోంది.
నిదుల రగడ…
గతంలో 44వ జాతీయ రహదారికి సంబంధించిన నిధులు తీసుకురావడంలో తమదే ఘనత అని అధికార పార్టీ మాజీ ఎంపీ నగేష్ ప్రకటించారు. దీనిపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు స్పందిస్తూ ప్రతి కౌంటర్ గా నిధుల వివరాలను వెల్లడించారు. అప్పటి నుంచి ఇరు పార్టీలు తమ విమర్శలను పదునుపెట్టాయనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా అనేక సందర్భాల్లో పేర్కొంటున్నారు. అలాగే ఇరుపార్టీల ప్రచార పర్వం కూడా సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరిపోతుంది. ఎవ్వరికి ఎవ్వరూ తగ్గడంలేదు. నువ్వా.. నేనా.. సై! అన్నంతగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇరు పార్టీల నేతల మధ్య అభివృద్ది మంత్రం చుట్టూ పోరు నడుస్తోంది. ఇదే విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు.