మరికొద్ది రోజుల్లో జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే రాజకీయ పార్టీలు విపరీతంగా శ్రమిస్తున్నాయి. ఎన్నిక ఏదైనా.. ఎప్పుడైనా… అదే తమ తొలి ఎన్నిక అన్నట్లు కష్టపడడం గులాబీ దండుకు ముందు నుంచి ఉన్న అలవాటే. తమదైన శైలిలో ఆ పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే అక్కడ గెలుపు ఖాయమైనప్పటికీ ఈ ఎన్నికను మంత్రి హరీశ్ రావు వ్యక్తిగతంగా తీసుకోవడంతో గులాబీ నేతలు అలుపెరగని రీతిలో కష్టపడుతున్నారు. అందులో భాగంగానే ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా ప్రత్యర్థి పార్టీల సంగతి చూసే పనిలో బిజీగా ఉన్నారు. తమ ప్రత్యర్థుల వేగానికి బ్రేకులు వేయడానికి ఎవరి వ్యూహాలను వారు అమలు చేసేస్తున్నారు. మైండ్ గేమ్ తో చుక్కలు చూపించేస్తున్నారు. మేము దేనికైనా రెెడీ.. ఎంతకైనా సిద్ధమన్న సంకేతాలు పంపుతూ ప్రత్యర్థి పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నట్లు తెలుస్తుంది. గులాబీదళం సంగతి ఇలా ఉంటే… కాంగ్రెస్ నేతల తీరు మరో విధంగా ఉంది.
మా తీరే వేరయా..
ఇప్పటికే దుబ్బాకలో గెలిచే అవకాశం లేదన్న విషయాన్ని ముఖ్య నేతలంతా ఫిక్స్ అయిపోయినట్లుగా సమాచారం. ఇంకా మ్యాచ్ మొదలే కాలేదు అప్పుడే రిజల్ట్ వచ్చేసినట్లు ప్రవర్తిస్తున్న సీనియర్ల తీరును గ్రౌండ్ లో కష్టపడుతున్న నేతలు తప్పు పడుతున్నారు. ఆట మొదలు పెట్టిన తరువాత ఏమైనా జరగవచ్చు. చివరి నిమిషం ఫలితం తేలే వరకు ఏ విషయాన్ని చెప్పలేమని అంటున్నారు నేతలు.
ఎన్నికల ప్రచార చివరి రోజు వరకు… ఆఖరకు ఎన్నికల రోజు చోటు చేసుకునే పరిణామలతో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏమో ఒక్కొసారి గుర్రం ఎగరావచ్చు అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ కొందరు కాంగ్రెస్ సీనియర్ల తీరు మాాత్రం అందుకు భిన్నంగా ఉంది. లేని అవకాశాల్ని ఉందని చెప్పి నేతల్లో భ్రమ కలిగించడం అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. దుబ్బాకలో గెలిచే అవకాశం ఎలాగు తమకు లేదని… కాబట్టి కనీసం ద్వితీయ స్థానం మీదనైనా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. పార్టీ రథసారథి ఉత్తమ్ తో పాటు పలువురు నేతలు సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలని రీతిలో వినియోగించుకుంటున్నప్పటికీ…. కొందరు నేతల కారణంగా లెక్కలు మారుతున్నాయి.
కొందరు నేతలు పని తక్కువ.. మాటలు ఎక్కువ అన్నట్లు చేస్తున్నారు. మైకు దొరికితే చాలు ముందుకు వచ్చి తెగ కబుర్లు చెప్పేస్తున్నారు. లోగుట్టుగా మాత్రం ద్వితీయ స్థానం తమకే అని తెగ సంబరపడిపోయి చంకలు గుద్దెసుకుంటున్నారు. దీంతో పార్టీలోని పలువురు నేతలకు నోట మాట రాకుండా అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ముందు మూడో స్థానంలో ఉంటామనే భయాందోళనలు ఉన్నప్పటికీ.. గడిచిన నాలుగైదు రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలతో రెండో స్థానం ఖాయమైనట్లేనని నేతలు భావిస్తున్నారు.. అదే తమ విజయంగా కాంగ్రెస్ నేతలు మీసాలు తిప్పేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోసం కష్టపడటం మానేసి ఈ బడాయి పనులేంటి బాబు అంటూ పార్టీలోని కొందరు నేతలు తలలు కొట్టుకుంటున్నారు. రెండోో స్థానం ఖాయమైనందుకే గెలిచినంత సంబరపడిపోతున్న కొందరు నేతల తీరు ఆ పార్టీలోని వారికే మింగుడుపడని విషయంగా ఉంది.











