టీఆర్ఎస్ పార్టీ మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజశేఖర్ అనే యువకుడ్ని బూతులు తిడుతున్న ఆడియో హల్చల్ చేస్తుంది. అసభ్య పదజాలంతో ఉన్న ఆ ఆడియోను వింటే అసలు వీరు ప్రజా ప్రతినిధులేనా? అనే అనుమానం రాకమానదు. ప్రజలు లేదా ఇతర పార్టీ నేతలు తమపై ఏమైనా ఆరోపణలు చేసినా, ప్రశ్నించినా వాటిని ఎదుర్కోవాలి కానీ ఇలాంటి బూతులు తిట్టడమేంటనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నేతగా రసమయికి మంచి పేరుంది. తన ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచిన ఉద్యమకారుడు ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు
బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన సమస్యలపై ప్రశ్నించినందుకు తనకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తిడుతూ నీ అంతు చూస్తా అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెదిరించినట్లు పోతి రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరుతో ఓ ఆడియో శనివారం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో బేగంపేట గ్రామానికి చెందిన సమస్యలను ప్రశ్నించినందుకు ఆ యువకుడిని ఎమ్మెల్యే రసమయి బెదిరించినట్లు తెలుస్తోంది. మరోసారి సోషల్ మీడియాలో పెడితే నీ అంతు చూస్తానని యువకుడ్ని బెదిరించాడు. బాధ్యతగల శాసన సభ్యులై ఉండి.. మీరు ఇలా పరుషపదజాలంతో తిట్టడమేంటని ఆ యువకుడి ఎమ్మెల్యేను ఆడియోలో కడిగిపారేశాడు. ఎమ్మెల్యే బెదిరింపులకు ఏ మాత్రం జంకకుండా, బెదర కుండా మీరు మాట్లాడే తీరు ఏమాత్రం బాగోలేదని నిలదీశాడు. అయితే సహనం కోల్పొయిన రసమయి మాత్రం అదే పనిగా అతనిని తిడుతూనే ఉన్నారు. ఆ ఆడియో వింటే అందులో కొన్ని మాటలు చెప్పడానికి కూడా వీళ్లేకుండా ఎమ్మెల్యే నోటి వెంటా వచ్చాయి. ఇలాంటి నాయకున్నా మానకొండూర్ ప్రజలు ఎన్నుకున్నదని ఆ యువకుడు ఎమ్మెల్యేను ప్రశ్నించాడు.
ఏం పీక్కుంటావో పీక్కో.. ఎమ్మెల్యేకు వార్నింగ్…
సమస్యలపై ప్రశ్నించినందుకు బూతులు తిట్టడంతో ఆ యువకుడు కూడా అదే స్థాయిలో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. ఏం పీక్కుంటావో పీక్కో అని ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చాడు. తాను తప్పు చేయలేదని ఎదురు తిరిగాడు. అధికారం నీదే కదా.. నేను చేసిన తప్పు ఏందో నిరూపించి తన మీద కేసుపెట్టుకో అని సవాల్ విసిరాడు. ఇలాంటి నాయకున్నా మేము ఎన్నుకున్నదని ప్రశ్నించాడు. మీ పార్టీలో మంచి మంచి నేతలు ఉన్నారు.. కానీ మీలాంటి నాయకున్ని ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్యేకు బదులిచ్చాడు.
అయితే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.