సాగర్ ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో ప్రచారం పర్వ వేగంగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పోటీగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నువ్వా-నేనా అన్నట్లు ప్రచారం చేస్తుండటంతో సాగర్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేసేందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ చేరుకున్నాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ‘టీఆర్‌ఎస్ నాయకులు మా గ్రామానికి రావొద్దంటూ’ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో పోలీసులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు. జీపు టాప్‌పైకి ఎక్కి టీఆర్‌ఎస్, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాడు. పోలీసులు సర్దిచెప్పడంతో సమస్య సద్దమణిగింది.
పైచెయ్యి ఎవరిదో…
అనుముల గ్రామం జానారెడ్డి సొంతగ్రామం కావడంతో టీఆర్‌ఎస్‌కు ప్రవేశం నిషేధించారు. కాగా టీఆర్‌ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా విస్తృత ప్రచారం చేస్తూ అనుముల గ్రామానికి వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డే అయినా, అయన కుమారుడే ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్నాడు. కాంగ్రెస్ అధిష్ఠానం జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినరోజు నుంచే రఘువీర్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నాడు. నోముల భగత్ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులతో ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో భగత్ జానారెడ్డి నియోజవకర్గంలోనూ ప్రచారానికి ఆసక్తి చూపడం హట్ టాపిక్ గా మారింది. దీంతో నోముల భగత్, రఘువీర్ రెడ్డిల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. ప్రచార పర్వం కూడా దగ్గర పడుతుండటంతో, ఎవరిదో పైచేయ్యి కానుందో త్వరలోనే తేలనుంది.
Must Read ;- జానారెడ్డి సీనియార్టీ VS కేసీఆర్ ఇమేజ్ VS మోదీ ఇమేజ్.. సాగర్‌లో పేలుతున్న విమర్శల తూటాలు