Political Heat in Nagarjuna Sagar Bypoll
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రచారానికి కొన్ని రోజులే సమయం ఉండడంతో పార్టీలు ప్రచారం చేయడంతోపాటు సవాళ్లు, ప్రతి సవాళ్లతో రంగంలోకి దిగాయి. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుండగా వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలో ఇక్కడ గెలిచి మళ్లీ కాంగ్రెస్ శ్రేణుల్లోఉత్సాహం నింపాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇక దుబ్బాకలో గెలుపు, జీహెచ్ఎంసీలో అనూహ్యంగా ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇక్కడ గెలిచి ఎమ్మెల్సీ ఓటమికి బదులు తీర్చుకోవడంతోపాటు తామే ప్రత్యామ్నాయమనేది మరోసారి నిరూపించుకోవాలని చూస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నాయి.
జానారెడ్డి సీనియార్టీ నిలబడుతుందా..
కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోకి దిగగా టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ను ఆ పార్టీ బరిలోకి దింపింది.ఒక్కమాటలో చెప్పాలంటే.. జానారెడ్డి సీనియార్టీ VS కేసీఆర్ ఇమేజ్VS మోదీ ఇమేజ్ అన్నట్టు పరిస్థితి మారింది. ఇందుకు కారణం కూడా ఉంది. మొదటి నుంచీ సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇప్పటివరకు పదిసార్లు పోటీచేసిన జానారెడ్డి రెండుసార్లు మాత్రమే ఓడారు. దాదాపు ముప్పైఏళ్లపాటు అదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 2018లో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఇక్కడ మరోసారి పట్టునిరూపించుకోవాలని జానారెడ్డి బరిలోకి దిగారు. జానారెడ్డితోపాటు ఆయన కుమారులు కూడా ప్రచారం చేస్తున్నారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొని టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని టీఆర్ఎస్ పథకాలను వివరించే యత్నం చేస్తున్నారు. బీజేపీ కూడా ఇటు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు నాగార్జునసాగర్ ప్రజలను మోసం చేశాయని బీజేపీ విమర్శిస్తోంది.
బూత్‌ల వారీగా..
సాగర్‌లో విజయం కోసం పార్టీలు అన్ని ప్రయత్నాలు చేయడంలో భాగంగా బూత్‌ల వారీగా దృష్టి సారించాయి. గ్రామాల్లో 200 నుంచి 500 ఓట్ల వరకు ప్రభావితం చేసే వారిని తమవైపు తిప్పుకునేందుకు యత్నాలు మొదలు పెట్టాయి. ఇక సర్పంచ్‌ల విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరిస్తున్నాయి. వీరితోపాటు పార్టీల్లో కోవర్ట్ ఆపరేషన్లు కూడా ప్రధానంగా మారాయి.
కేసుల నమోదు..
సాగర్ ఎన్నికల్లో నియమావళి ఉల్లంఘనలతో పాటు కేసులూ నమోదవుతున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలనే టార్గెట్ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారం తాము వ్యవహరిస్తున్నామని యంత్రాంగం చెబుతోంది. మొత్తం మీద తనిఖీలు కూడా భారీగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏడు కేసుల్లో రూ.46 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 45 ప్రాంతాల్లో తనిఖీ చేయగా రూ.35 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. మూడు పార్టీలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. ఇక కొవిడ్ నిబంధనలు అతిక్రమించిన ఆరోపణలపై 88 కేసులు నమోదయ్యాయి. మంత్రి జగదీష్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి కాన్వాయ్ లకు సంబంధించి కేసు నమోదయ్యాయి. కాన్వాయ్‌ల రికార్డులను కూడా నమోదు చేస్తున్నారు.
Tough War Between Congress, TRS and BJP Raises Political Heat in Nagarjuna Sagar Bypoll
Must Read ;- హామీలు నెరవేరిస్తేనే సాగర్ లో కేసీఆర్ అడుగుపెట్టాలి : ఎంపీ రేవంత్ రెడ్డి