నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని జానారెడ్డి ఖరారు చేసేసుకున్నారు. అంతేకాదు.. సాగర్ ఉప ఎన్నికలు అయ్యేవరకు పీసీసీ ఎంపికను ఆపాలని లేఖ కూడా రాశారు. అంటే కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి స్థాయి ఏంటనేది తెలుస్తుందని పార్టీ నాయకులే చర్చించుకున్నారు. అయితే సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు..తాజాగా నాగార్జున సాగర్‌లో జానారెడ్డి పరిస్థితి ఇలాగే మారిందనే చర్చ పార్టీలో మొదలైంది.
మొత్తం తానే చూసుకుంటానంటూ..
సాగర్ ఎన్నికల ప్రచారం మొత్తం తానే చూసుకుంటానని, వేరే నాయకులు అవసరం లేదని, ఒక వేళ వచ్చినా తనకు సంబంధం లేకుండా ప్రచారం చేసుకోవాలని, అది పార్టీ చూసుకోవాలని పార్టీ సమావేశంలో చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఇక తన ప్రచార షెడ్యూల్, రోడ్ మ్యాప్, ఆర్థిక వ్యవహారాలన్నీ తన కుమారుడే చూసుకుంటాడని చెప్పినట్టు కూడా నాయకులు చర్చించుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని, ఇతర నాయకులు వస్తే తనక సపోర్టుగా ఉంటుందని జానారెడ్డి భావించిరారని, అందుకే ఇతర నాయకులతో కలసి ప్రచారం చేస్తున్నారని చర్చ నడుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. జానారెడ్డి ఇప్పటి వరకు 11సార్లు పోటీ చేశారు. అందులో దాదాపు అన్ని సార్లు జనరల్ ఎన్నికలే. ఉప ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయడం ఇటీవలి కాలంలో జరగలేదు. రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఉప ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో అధికారం పార్టీ తన బలాన్ని భారీ స్థాయిలో మొహరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతోపాటు స్వచ్చందంగా టీఆర్ఎస్ కోసం పనిచేసే వారినీ రంగంలోకి దింపింది టీఆర్ఎస్ పార్టీ. అంటే సర్వశక్తులూ ఒడ్డుతోందని చెప్పవచ్చు.
పార్టీ నాయకుల సపోర్టు తప్పదనుకుంటూ..
అదే సమయంలో కాంగ్రెస్ నుంచి తానొక్కడినే చూసుకుంటానని చెప్పడంతో ఇతర నాయకులు కొంత దూరంగా ఉండాల్సి వచ్చింది. జరగనున్న ప్రమాదాన్ని గ్రహించిన జానారెడ్డి పార్టీ నాయకుల సపోర్టు తప్పదని భావించినట్టు తెలుస్తోంది. ఒకటిరెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగార్జునసాగర్ ప్రచారానికి వెళ్లనున్నారు. కొవిడ్ బారిన పడి కోలుకుంటున్న పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఏప్రిల్ 8 తరువాత నాగార్జునసాగర్ లోనే ఉండనున్నారు. సీతక్క, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, కొండా సురేఖ, తదితరులు కూడా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు.
కేసీఆర్ సభకు కౌంటర్ ఇచ్చేలా..
కాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కంటే ముందే హాలియాలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ ఉప ఎన్నికలకు సంబంధించింది కాదని చెప్పినా..కేసీఆర్ ప్రసంగం మాత్రం సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఉందని చెప్పవచ్చు. ఇక ఏప్రిల్ 14న అనుములలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గంలో 6మండలాల్లో టీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు. ఒక రకంగా చెప్పాంటే.. టీఆర్ఎస్ బలప్రదర్శన సభగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం మీద నాగార్జునసాగర్‌లో అభ్యర్థుల ప్రకటన వరకు రాజకీయ పరిస్థితులు ఒకరకంగా ఉండగా అభ్యర్థుల ఖరారు తరవాత రాజకీయ సమీకరణాలు మారాయని చెప్పవచ్చు.
Must Read ;- సాగర్‌లో అసమ్మతి.. బీజేపీ, టీఆర్ఎస్‌ల్లో టెన్షన్