తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా టిటీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ లో తెలుగుదేశం పార్లమెంటు పార్టీ అధ్యక్షులు గుల్లాపల్లి ఆనంద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సిర్ పూర్ నియోజకవర్గ పరిధిలోని కాగజ్ నగర్ డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటికే అనేక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల పై విద్యుత్ చార్జీల పేరిట మోయలేని భారాన్ని మోపడం దారుణమని ఆయన విమర్శించారు. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై కెసిఆర్ ప్రభుత్వం ఇటువంటి భారాన్ని మోపడం అమానుషమన్నారు.యూనిట్ పై రూపాయికి పైగా ధరలు పెంచిన ప్రభుత్వం పెద, మధ్య తరగతి కుటుంబాలపై ఏకంగా 5600 కోట్ల భారం మోపుతూ దోపిడీకి పాల్పడుతోందని ఆనంద్ ఆరోపించారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ఇప్పుడు ప్రభుత్వం కరెంట్ చార్జీలను కూడా పెంచడం గోరుచుట్టు మీద రొకటిపోటులా మారిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల కష్టాలను గుర్తించి పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం చేస్తున్న దోపిడిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలతో కలిసి తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Must Read:-తెలంగాణలో మొదలైన ఎలక్షన్ హీట్! కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి గుడ్‌బై?











