జీహెచ్ఎంసీ ఎన్నికలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. దీంతో ప్రచార హోరు ప్రారంభమైంది. అయితే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార పర్వంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే పాపులర్ అయిన రావాలి జగన్.. కావాలి జగన్ నినాదం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రథంపై ఉండడంతో అది సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నిన్నటితో ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచార బాట పడుతున్నాయి. పోలింగ్‌కు ఇక 10 రోజులే మిగిలి ఉండడంతో పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఈక్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ఓ ఆసక్తి కరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాపులర్ నినాదాన్ని గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఒకరు వాడుకుంటున్నారు. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం కనిపిస్తుండటంతో ఓటర్లు ఆశ్చర్య పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రచార రథంపై జగన్ నినాదం కనిపించడమేంటనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. జగన్ నినాదం ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వినిపించడమేంటని? ఒకవేళ ఏమైనా వైఎస్ఆర్ పార్టీ రథాలను టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం అక్కడి నుంచి పంపించారా? అనే చర్చ జరుగుతోంది.
Also Read ;- గ్రేటర్ ఎన్నికల పోరుకు చంద్రబాబు డైరెక్షన్!
ఇదీ సంగతి…
అయితే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల రథంపై రావాలి జగన్.. కావాలి జగన్.. ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోపై ఒక్కొక్కరు ఒక్కొలా స్పందిస్తున్నారు. ఆ రథాలకు గులాబీ రంగులు వేసి జగన్ స్టిక్కర్ తీయడం మర్చిపోయారని కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో వైసిపి వాడిన ప్రచార రథాలను టీఆర్ఎస్ అద్దెకు తెచ్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. వాస్తవంగా ఎన్నికల సమయాల్లో ప్రచార రథాలను ఆయా పార్టీలు అద్దెకు తెచ్చుకుంటాయి. అయితే గ్రేటర్ ఎన్నికల్లో జగద్గిరిగుట్ట డివిజన్ నుంచి కొలుకుల జగన్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. అతని పేరు కూడా జగన్ కావడంతో ఎన్నికల స్లోగన్‌లలో ఇప్పటికే పాపులర్ అయిన రావాలి జగన్.. కావాలి జగన్ నినాదాన్ని తన ఎన్నికల ప్రచార రథంపై రాయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రచార రథం ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల కామెంట్లు వినబడుతున్నాయి.
Must Read ;- గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బాలయ్య, లోకేష్!