కొత్త జిల్లాల ఏర్పాటు ఏపీలో రేషన్ లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది.ఏప్రిల్ రెండో వారం సమీపిస్తున్నా ఇంతవరకు రేషన్ పంపిణీ మొదలవ్వలేదు. రేషన్ ఎప్పుడు అందుతుందా అని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటి వరకు రేషన్ సరుకులు డిపోలకే చేరని పరిస్థితి నెలకొంది.
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు రేషన్ లబ్ధిదారులకు శాపంగా మారింది. ప్రతీ నెల ఒకటవ తేదీన అందాల్సిన రేషన్ రెండవ వారం సమీపిస్తున్నా అందని పరిస్థితి కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నెలకొంది.మరికొన్ని చోట్ల ఇప్పటి వరకు సరుకులు డిపోలకు కూడా చేరుకోలేదు. దీంతో లబ్ధిదారులు రేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే రేషన్ పంపిణీ తాత్కాలికంగా నిలిపివేతకు కొత్త జిల్లాల ఏర్పాటే కారణంగా తెలుస్తోంది.
వాస్తవానికి ప్రతీ నెల 1 వ తేదీ నుంచే ప్రభుత్వం రేషన్ పంపిణీ చేయాల్సి ఉండగా, ఈ నెల మాత్రం పదో తేదీ తరువాత పంపిణీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని అధికారవర్గాలు చెబుతున్నాయి.జిల్లాల విభజనతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలు కొత్త జిల్లాల్లోకి విలీనం అయ్యాయి.ఈ క్రమంలోనే పాత జిల్లాల్లో కార్డుల సంఖ్య తగ్గింది. దీంతో జిల్లాల వారీగా బియ్యం కార్డుల వివరాలు కూడా వేరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పౌర సరఫరాల శాఖ డిపోల వారీగా వివరాలను ఆ శాఖ పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంది. ఈ పని పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్డుల విభజన, నమోదు పూర్తయిన తరువాత బియ్యం, సరుకులు పంపిణీ మొదలవుతుంది.
అయితే ఇప్పటికే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైన నేపధ్యంలో వెంటనే ఆ ప్రక్రియ మొదలు కావచ్చనే సమాచారం అందుతోంది.అయినప్పటికీ, 10 వ తేదీ తరువాతే బియ్యం పంపిణీ ఉండవచ్చనేది సంబంధిత శాఖ అధికారుల నుంచి అందుతున్న సమాచారం. మరోవైపు చాలా చోట్ల ఇప్పటివరకు సరుకులు డిపోలకు చేరలేదు.కొత్త జిల్లాల్లో ఒకటి రెండు రోజుల్లో గోదాముల నుంచి డిపోలకు సరుకులు చేర్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు తమ పాలిట శాపంగా మారిందనే వాదన రేషన్ లబ్ధిదారుల నుంచి వినిపిస్తోంది.