కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా వయసులో యువకుడే అయినా.. రాజకీయాల్లో మాత్రం తలపండిన నేతగానే చెప్పాలి. సింధియా ఫ్యామిలీ ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినా.. జ్యోతిరాధిత్య ఇటీవలే హస్తం పార్టీకి హ్యాండిచ్చేసి బీజేపీలో చేరిపోయారు. చిన్న వయసులోనే ఏకంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు. తండ్రి మాధవ్ రావు సింధియా జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే సాగినా.. జూనియర్ సింధియా తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే బీజేపీలో చేరిపోయారని, అందుకు ప్రతిఫలం కూడా దక్కించుకున్నారనే చెప్పాలి. మొత్తంగా వయసులో కుర్రోడైనా.. పాలిటిక్స్ లో మాత్రం సింధియాను అపర మేథావిగానే చెప్పాలి. కేంద్ర మంత్రి హోదాలో శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సింధియా.. మంత్రి కేటీఆర్ తో కలిసి మెడికల్ డ్రోన్ డెలివరీని ప్రారంభించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తోనూ సింధియా భేటీ అయ్యారు. ఈ భేటీ, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సింధియా తనదైన శైలి విభిన్నతను చాటుకుని.. ప్రస్తుత రాజకీయాలకు సరైన నేతగా తనను తాను నిరూపించుకున్నారు.
తెలంగాణ అభివృద్ధికి సహకారం
సీఎం కేసీఆర్ తో భేటీ సందర్భంగా పలు అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చాయి. హైదరాబాద్ ఎకనమిక్ డెలవప్ మెంట్ హబ్ గా మారుతోందని, ఈ క్రమంలో వివిధ దేశాలకు హైదరాబాద్ తో నేరుగా ఫ్లైట్ కనెక్టివిటీ కల్పించాలని కేసీఆర్ కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటునూ కేసీఆర్ ప్రస్తావించారు. వీటన్నింటికీ సానుకూలంగా స్పందించిన సింధియా.. శంషాబాద్ ఎయిర్ పోర్టు విస్తరణకు సహకరిస్తామని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణలోని కీలక నగరాలు, పట్టణాల్లో కొత్త ఎయిర్ పోర్టుల విషయాన్ని పరిశీలిస్తామని కూడా చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం ఎంత చేయాల్సి ఉందో అంతా చేస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కూడా సింధియా చెప్పారు. అంతకుముందు కేటీఆర్ తో కలిసి మెడికల్ డ్రోన్ డెలివరీని ప్రారంభించిన సందర్భంగానూ కేటీఆర్ ప్రస్తావించిన పలు కీలక అంశాల పట్ల సింధియా సానుకూలంగానే స్పందించారు.
టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే
కేసీఆర్‌తో భేటీలో సాంతం పాలనా అంశాలపైనే మాట్లాడిన సింధియా ఒక్కటంటే ఒక్క రాజకీయ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. అయితే కేసీఆర్ తో భేటీ ముగిసిన తర్వాత బీజేపీ నేతగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని సింధియా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. తెలంగాణ బీజేపీ బలోపేతం అవుతోందని కూడా సింధియా చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికలే ఇందుకు నిదర్శనమని చెప్పిన సింధియా.. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని కూడా ఆయన చెప్పారు. మొత్తంగా కేసీఆర్ తో భేటీ సందర్భంగా పాలనాపరమైన విషయాలను ప్రస్తావించిన సింధియా.. బయటకు రాగానే రాజకీయాలను ప్రస్తావించి సిసలైన రాజకీయవేత్తగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు.