Beneficiaries Bank Accounts Frozen Due To Dalit Bandhu Scheme Funds:
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కారు రాజకీయ లబ్ధి కోసమే ప్రారంభించినదే అయినా.. దళిత బంధు పథకం దళితుల్లో వెలుగు నింపేదేనని చెప్పాలి. ఒక్కో దళిత కుటుంబానికి ఏకంగా రూ.10 లక్షల నగదు ఇస్తూ.. తమ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం నిజంగానే దేశంలోనే ఉత్తమ పథకమేనని కూడా చెప్పక తప్పదు. మరి అలాంటి పథకం మీద ఎప్పటికప్పుడు కొత్త కొత్త విమర్శలు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా వచ్చిన విమర్శలన్నీ రాజకీయపరంగా వచ్చినవే అయినా.. తాజాగా వచ్చిన విమర్శ మాత్రం టీఆర్ఎస్ సర్కారుతో పాటు సీఎం కేసీఆర్ ఇమేజీని భారీగానే డ్యామేజీ చేసేదేనని కూడా చెప్పక తప్పదు.
పళ్లెం దాటని మెతుకులు
నిజమే.. పళ్లెంలో అన్నం ఉండటం ముఖ్యం కాదు. దానిని నోటికి అందిస్తేనే ఉపయోగం. అలా చేస్తేనే కడుపు నిండుతుంది. ఆకలి మాయమవుతుంది. దళితుల్లోని దారిద్య్రాన్యి పారదోలాలంటే.. అందుకు అవసరమయ్యే నిధులను కేవలం పళ్లెంలో పెట్టడం మాత్రమే కాదు.. ఆ నిధులు దళితుల చేతికి అందాలి. వారి నోటీకి అందాలి. అప్పుడే ఆ పథకం విజయవంతమైనట్లు లెక్క. అయితే కేసీఆర్ సర్కారు అట్టహాసంగా ప్రారంభించిన దళిత బంధు పథకంలో ఈ తరహా పరిస్ఙతి ఇంకా మొదలు కాలేదట. దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేశామంటూ కేసీఆర్ ఘనంగానే ప్రకటించినా.. ఆ నిధులన్నీ మొన్నటిదాకా ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లోనే ఉండిపోయాయట. ఇదేంటంని లబ్ధిదారులు నిలదీస్తే.. రోడ్డెక్కితే గానీ కేసీఆర్ సర్కారులో చలనం రాలేదట. ఆ తర్వాత కేసీఆర్ సర్కారు ఆదేశాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేశారట. అయితే అలా తమ ఖాతాల్లో జమ అయిన దళిత బంధు నిధులను విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు వెళ్లిన లబ్ధిదారులకు అక్కడా ప్రతిబంధకమే ఎదురైందట. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే మీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామన్న బ్యాంకర్ల సమాధానంతో కలెక్టర్ల వద్దకెళితే.. ‘‘ఈ నిధులతో మీరేం చేస్తారో చెప్పాలి. ఎందుకు వినియోగిస్తారో చెప్పాలి. మీరు చెప్పిన వ్యాపారాలు లాభసాటివి అయి ఉండాలి. అప్పుడే నిధుల విత్ డ్రా సాధ్యం అవుతుంది’’ అని చావు కబురు చల్లగా చెప్పరట. అంటే దళిత బంధు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసినా ఆ ఖాతాలను బ్యాంకర్లు ఫ్రీజ్ చేసిపారేశారన్న మాట.
ఆ రెండు చోట్లా ఇదే పరిస్థితి
దళిత బంధును ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పినా.. ముందుగా భువనగిరి జిల్లాలోని తన దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు సరిపడ రూ.7.60 కోట్లను విడుదల చేశారు. ఆ తర్వాత హుజూరాబాద్ లో 20 వేల మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేస్తున్నట్లుగా ప్రకటించిన కేసీఆర్ సర్కారు.. అందుకు సరిపడ రూ.2 వేల కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను ఆగస్టు చివరి దాకా భువనగిరి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ములిగాయట. ఆ తర్వాత లబ్ధిదారుల ఆందోళనతో గడచిన నాలుగైదు రోజులుగా ఆయా జిల్లాల కలెక్టర్లు నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం మొదవలెట్టారట. తమ ఖాతాల్లో దళిత బంధు నిధులు జమ అయ్యాయన్న మెసేజ్ లతో లబ్ధిదారులు బ్యాంకులకు పరుగులు పెట్టారట. అయితే తమ ఖాతాలన్నీ ఫ్రీజ్ అయ్యాయని తెలుసుకుని కలెక్టరేట్లకు వెళ్లి జిల్లా కలెక్టర్లను సంప్రదించారట. లాభసాటి వ్యాపారాలు చెబితే తప్పించి ఆ నిధులను విత్ డ్రా చేసుకోవడం కుదరదని కలెక్టర్లు తేల్చి చెప్పారట. ఈ క్రమంలో ట్రాక్టర్ కొంటానని ఒకరు, కారు కొని క్యాబ్ గా మార్చుకుంటానని మరొకరు చెబితే.. అవేవీ లాభసాటి వ్యాపారాలు కాదని కలెక్టర్లు వారి ముఖం మీదే చెప్పారట. దీంతో జిల్లా కలెక్టర్లు భావించే లాభసాటి వ్యాపారాలేవో అర్థం కాక దళిత బంధు లబ్ధిదారులు జుత్తు పీక్కుంటున్నారట.
Must Read ;- రేవంత్ దెబ్బకు కేసీఆర్ బయటకొచ్చారా?