అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందని మనకో సామెత ఉంది. అలాంటి పరిస్థితే బేబమ్మ కృతిశెట్టిది అనుకోవాలేమో. ఆమె ఆకృతి బాగున్నా, అవకాశాలు వెల్లువెత్తుతున్నా కరోనా మాత్రం ఆమెను కనికరించడం లేదు. అంగీకరించిన సినిమాలు పూర్తికావడమే గగనమవుతోంది. పరిస్థితులన్నీ సక్రమంగా ఉంటే ఈపాటికి మరికొన్ని సినిమాలు చేయడానికి కూడా అవకాశం ఉండేది. అనుకున్నట్లు గానే తెలుగులో కృతిశెట్టి నటించిన మొదటి సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా షూటింగులో ఉండగానే అంగీకరించిన సినిమాలు పూర్తిచేయాల్సి ఉంది.
మరికొన్ని అవకాశాలు వచ్చిపడుతున్నా ఆమె ఒప్పుకునే స్థితిలో లేదు. దీనికి కారణం ఈ కారోనానే. ఉప్పెన తర్వాత కృతి రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి నాని హీరోగా నటించే ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో ఓ హీరోయిన్ గా ఆమె నటిస్తోంది. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందే ద్విభాషా చిత్రాన్ని కూడా ఆమె అంగీకరించింది. ఇది భారీ సినిమా. ఇది సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో తెలియదు. అలాగే సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలోనూ కృతి నటిస్తోంది.
కృతికి సంబంధించి తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. అదే బెల్లంకొండ సురేష్ నిర్మించే సినిమా. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. పవన్ సాదినేని దర్శకత్వంలో గణేష్ ఓ సినిమా చేస్తున్నాడు. తన కుమారుల కోసం బెల్లంకొండ సురేష్ రీమేక్ హక్కులను కొనుగోలు చేస్తున్నారు. ధనుష్ హీరోగా రూపొంది ఇటీవల పెద్ద హిట్ అయిన కర్ణన్ రీమేక్ హక్కులను సురేష్ కొన్నట్లు తెలిసింది.
చిన్న కుమారుడు గణేష్ కోసం 2006లో విడుదలైన ‘వివాహ్’ హక్కులను కూడా ఆయన కొన్నట్లు తెలిసింది. ఈ వివాహ్ లో నటించేందుకు కృతిని సంప్రదించినట్టు సమాచారం. కృతి మాత్రం తాను మొదట కమిట్ అయిన చిత్రాలను పూర్తిచేశాకే మిగతా సినిమాలు అంగీకరించాలన్న ఆలోచనలో ఉంది. అందుకే తేజ సినిమాను కూడా ఈ భామ వదులుకుంది అంటున్నారు. మరి బెల్లంకొండ సినిమా విషయంలో ఈమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కాలమే నిర్ణయించాలి.
Must Read ;- రానా తమ్ముడి డెబ్యూ మూవీకి నో చెప్పిన బేబమ్మ?