Uttam Kumar Reddy Going To Bangalore For Nature Cure :
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సంబంధించి తెలంగాణ శాఖలో కొత్త జోష్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టీ పీసీసీ చీఫ్ గా కొత్తగా ఎంపికైన రేవంత్ రెడ్డికి బుధవారం బాధ్యతలను అప్పగించనున్నారు. ఆ వెంటనే ఆయన గాయబ్ కానున్నారు. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి దక్కడంపై కాంగ్రెస్ పెద్దల్లో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉత్తమ్ ఈ జాబితాలో లేరనే చెప్పాలి. ఎందుకంటే.. చాలా కాలం నుంచి కూడా ఈ బాధ్యతలను వేరొకరికి అప్పగించేందుకు ఉత్తమ్ సిద్ధంగానే ఉన్నారు. వరుస ఓటములే ఇందుకు కారణంగా కూడా చెబుతున్నారు. రేవంత్ ఎంపికపై అసంతృప్తి లేకపోతే.. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టగానే ఉత్తమ్ ఎందుకు గాయబ్ అవుతున్నారు? అసలు ఎక్కడికి వెళుతున్నారు? ఏ కారణంతో వెళుతున్నారు? మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తారు? అసలు రాజకీయాల్లోనే ఉంటారా? లేదా? అన్న ప్రశ్నలు వరుసగా మెదులుతున్నాయి కదా.
బెంగళూరుకు వెళుతున్న ఉత్తమ్
బుధవారం మధ్యాహ్నం గాంధీ భవన్ లో వేడుకగా జరగనున్న కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారు. అంటే.. బుధవారంతో ఆ బాధ్య తల నుంచి ఉత్తమ్ తప్పుకుంటున్నట్టే కదా. ఇదే విషయాన్ని తెలుపుతూ.. తనకు ఇంతకాలంగా పీసీసీ చీఫ్ గా కొనసాగించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ నిన్న ఉత్తమ్ లేఖ రాశారు. పార్టీ కీలక పదవి నుంచి తప్పుకుంటున్నా.. తాను రాజకీయాల్లోనే ఉంటానని.. పార్టీ నేతలు, కార్యకర్తలకు రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటానని.. ఏ విషయంలో అయినా, ఏ సమయంలో అయినా తనను సంప్రదించవచ్చని ఉత్తమ్ ఆ లేఖలో తెలిపారు. ఈ విషయంతో పాటు మరో ఆసక్తికర అంశాన్ని ఆయన అందులో ప్రస్తావించారు. అదేంటంటే.. గురువారం నుంచి ఓ పది రోజుల పాటు సెలవు పెడుతున్నానని, బెంగళూరులో ప్రకృతి చికిత్స తీసుకునేందుకు వెళుతున్నానని, అక్కడి నుంచి తిరిగి వచ్చినంతనే పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ సెంటర్ లో ప్రకృతి చికిత్స తీసుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు.
నేచర్ క్యూర్ ఎందుకోసమో..?
గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరున్న బెంగళూరు.. ఐటీ కంపెనీల హబ్ గానే కాకుండా ప్రకృతి చికిత్సలకు కూడా కేంద్రంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ సమస్యను మినహాయిస్తే బెంగళూరు నగరం పీస్ ఫుల్ సిటీగానే భావించాలి. అందుకే.. చాలా మంది ప్రముఖులు ఏ మాత్రం అవకాశం చిక్కినా బెంగళూరునే తమ శాశ్వత నివాసంగా ఎంచుకుంటారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రకృతి చికిత్సల కోసం బెంగళూరుకే వస్తున్నారు. ఆ మాదిరిగానే.. కాస్తంత ప్రశాంతత కోసం బెంగళూరు వెళ్లాలని నిర్ణయించుకున్న ఉత్తమ్.. పనిలో పనిగా ప్రకృతి చికిత్స తీసుకుంటే మరింత ప్రశాంతత దొరుకుతుంది కదా అనుకున్నారేమో.. లేదంటే చాలా కాలంగా పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన నేపథ్యంలో నిత్యం ఉరుకులు పరుగులు పెట్టిన నేపథ్యంలో బాడీని కూల్ స్టేట్ కు తీసుకెళ్లాలనున్నారో.. మరీ కాదంటే చేతిలోని పీసీసీ పదవి చేజారిపోతుంటే టెన్షన్ కు లోనై నేచర్ క్యూర్ కు సిద్ధపడ్డారో.. తెలియదు గానీ.. ఉత్తమ్ మాత్రం పది రోజుల పాటు ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోతున్నారు.
Must Read ;- రేవంత్.. జడ్పీటీసీ టు టీపీసీసీ!