New Colors To Gandhi Bhavan :
గాంధీ భవన్.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఏడేళ్లకు ముందు ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలకు కేంద్రంగా కొనసాగిన ఈ భవన్.. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు మాత్రమే పరిమితమైపోయింది. హైదరాబాద్ లోని నాంపల్లి ల్యాండ్ మార్క్ గా ఉన్న ఈ భవన్ కు.. నిజంగానే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడే కొత్త కళ వచ్చింది. ఇటీవలే టీ పీసీసీ చీఫ్ గా మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి ఎంపికైన సంగతి తెలిసిందే. బుధవారం నాడు ఆయన టీ పీసీసీ చీఫ్ గా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చాలా మార్పులు చేసిన పార్టీ కేడర్.. ఆ ప్రాంతానికి కొత్త కళను అద్దారు. ఇప్పుడక్కడ సందడి వాతావరణం నెలకొంది.
దిక్కలేనిదిగా గాంధీ భవన్
అప్పుడెప్పుడో పన్నెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా.. గాంధీ భవన్ కళకళలాడేది. పార్టీ కార్యాలయానికి వచ్చిపోయే నేతలతోనే నాడు గాంధీ భవన్ లో సందడి కనిపించేది. అయితే పాత భవనమైన గాంధీ భవన్ కు కనీసం రంగులు వేసే విషయాన్ని కూడా వైఎస్సార్ తో పాటు చాలా మంది నేతలు అస్సలు పట్టించుకున్న పాపానే పోలేదనే చెప్పాలి. వైఎస్సార్ మరణం తర్వాత గాంధీ భవన్ కు వచ్చే నేతల సంఖ్య క్రమంగా తగ్గిపోయారు. తర్వాత రోశయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా పదవులు చేపట్టినా పార్టీని మాత్రం పట్టించుకోలేకపోయారు. కిరణ్ హయాంలోనే రాష్ట్ర విభజన జరగడంతో గాంధీ భవన్ దిక్కు లేనిదిగానే మారిందని చెప్పాలి.
ఉత్తమ్ తో ఊపు వచ్చినా..
తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు దక్కాల్సిన గౌరవాన్ని ఆ పార్టీ నేతలే కాలదన్నుకున్నారన్న వాదనలూ లేకపోలేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కొంత ఊపు కనిపించినా అది చప్పున చల్లారిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగానే పార్టీని వీడారు. వెరసి కాంగ్రెస్ లో సత్తా కలిగిన నేత అంటూ లేకుండా పోయారు. పార్టీ పదవుల కోసం కొట్లాడుకునే నేతలు.. గాంధీ భవన్ ను ఉద్ధరించే విషయంపై మాత్రం ఆసక్తి చూపలేదు. వెరసి పదేళ్లకు పైగా గాంధీ భవన్ దిక్కులేనిదిగానే కాలం వెళ్లదీసింది.
కలర్ ఫుల్లుగా గాంధీ భవన్
ఇప్పుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాగానే.. గాంధీ భవన్ రూపు రేఖలన్నీ మార్చేయాలన్న నిర్ణయం జరిగింది. గాంధీ భవన్ లో కొన్ని వాస్తు దోషాలున్నాయని గుర్తించిన రేవంత్ వాటిని సరిదిద్దే పనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ప్రమాణానికి మంగళవారానికే ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి చెందిన కీలక నేతలతో పాటుగా పొరుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు, పార్టీ సీనియర్లు హాజరవుతున్నారు. ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటుగా కేసీఆర్ శిబిరంలో ఆందోళనను రేకెత్తించాలన్న దిశగా రేవంత్ తన పదవీ ప్రమాణాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. వెరసి గాంధీ భవన్ ఇప్పుడు కలర్ ఫుల్లుగా కనిపిస్తోంది. కొత్త కళతో కళకళలాడుతోంది.
Must Read ;- రేవంత్ స్టైల్.. కాంగ్రెస్‌కు టానిక్ ప్లాన్!