“ఎఫ్ 2” కంటే మించిన ఫన్ మిళితం చేసి అద్బుతమైన కథను “ఎఫ్ 3” కోసం దర్శకుడు అనిల్ రావిపూడి సిద్ధం చేశాడని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. వెంకటేశ్, తమన్నా, వరుణ్‌తేజ్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న “ఎఫ్ 3” చిత్రం గురువారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. లోగడ ఇదే కాంబినేషన్లో వచ్చిన “ఎఫ్ 2” చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ముహూర్తపు సన్నివేశాన్నివరుణ్ తేజ్, తమన్నాలపై చిత్రీకరించారు. అల్లు అరవింద్ తో పాటు ఫైనాన్షియర్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ స్పందిస్తూ, ‘‘గత ఏడాది సంక్రాంతికి మా సంస్థ నుంచి వచ్చిన ‘ఎఫ్ 2’ చిత్రం ప్రేక్షకులను ఎంతగా నవ్వించిందో తెలియంది కాదు. దానికి మోర్ ఫన్ సమ్మిళితం చేసి ‘ఎఫ్ 3’ కథ సిద్ధమైంది. డిసెంబర్ 23 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెడుతున్నాం’’ అని అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ – ‘‘మరోసారి విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ జంటలు నవ్వుల్లో మరింతగా ముంచెత్తుతారు. ఈ సంస్థలో మరోసారి పనిచేయడం ఆనందదాయకం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటింగ్: తమ్మిరాజు రచనా సహకారం: ఎస్.కృష్ణ, ఆడిషన్ స్క్రీన్‌ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్, సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి,
సమర్పణ: దిల్‌రాజు, నిర్మాత: శిరీష్, రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి











