ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన నేతలు ఏ రీతిన చెలరేగిపోయారన్న విషయంపై వరుసబెట్టి సంచలన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఏ పదవీ లేని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వారే విపక్ష నేతలపై నాడు పేట్రేగిపోగా… ఇక ఏదో ఒక పదవి ఉన్న నేతలు అయితే మరింతగా రెచ్చిపోయారు. ఇక ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారు అయితే అందినకాడికి దోచుకున్నారు. ఇందుకోసం వైసీపీ ప్రజా ప్రతినిధులు ఏకంగా కీలక స్థానాల్లో పనిచేస్తున్న అధికారులను వాడుకుని మరీ ఈ వసూళ్ల పర్వాన్ని కొనసాగించారు. ఫలితంగా తప్పుడు మార్గాల్లో అక్రమ సంపాదనను కూడబెట్టిన సదరు ప్రజా ప్రతినిధులతో పాటుగా వారికి సహకరించిన అధికారులు సైతం ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైసీపీ జమానాలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగానే కాకుండా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన విడదల రజినీకి చెందిన ఓ ఘనకార్యం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఘటనలో కోట్లాది రూపాయలను వసూలు చేసిన రజినీతో పాటు ఆమె తరఫున రంగంలోకి దిగిన ఇద్దరు అధికారులు లక్షల రూపాయలను మింగి అడ్డంగా బుక్కైపోయారు.
అటు కాకినాడ సీ పోర్టు అయినా… ఇటు చిలకలూరిపేటకు చెందిన వసూళ్ల పర్వమనా… వైసీపీ నేతలు ఒకే పంథాను ఎన్నుకున్నారని చెప్పాలి. కాకినాడ సీ పోర్టు యాజమాన్యం పన్నులు ఎగ్గొట్టిందన్న తప్పుడు నివేదికలతో సదరు కంపెనీని జగన్ అండ్ కో చెరబడితే…అదే మంత్రాన్ని రజినీ కూడా ఫాలో అయిపోయారు. చిలకలూరిపేటకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యంపై కన్నేసిన రజినీ… సదరు కంపెనీ యజమానులను తన పీఏ రామకృష్ణ సహాయంతో తన వద్దకు పిలిపించుకుని…తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. అప్పటికి ఇంకా మంత్రి కూడా కాని రజినీ నుంచి ఈ మేర షాక్ తగలడంతో సదరు కంపెనీ యజమానులు ఏం చేయాలా? అన్న దిశగా ఆలోచన చేశారు. అయితే తానడిగిన డబ్బు ఎంతకూ తన వద్దకు రాకపోయేసరికి నాడు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారిగా కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి జాషువాను రజినీ రంగంలోకి దింపారు.
అధికార పార్టీకి చెందిన వారి అడుగులకు మడుగులొత్తిన ఇతర అధికారుల మాదిరే… జాషువా కూడా రజినీ చెప్పంగానే రంగంలోకి దిగిపోయారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ లో తనిఖీలు చేసిన జాషువా… కంపెనీలు పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీంతో కంపెనీ రూ.50 కోట్ల మేర జరిమానా కట్టాలంటూ బెదిరించారు. అయినా ఇవన్నీ ఎందుకు ఎమ్మెల్యే గారి వద్దకు వెళ్లి సెటిల్ చేసుకోవచ్చు కదా అని కూడా ఆయన వారికి ఉచిత సలహా ఇచ్చారు. తీరా అప్పటికీ యజమానులు దిగిరాకపోవడంతో… వారిని నేరుగా తన కార్యాలయానికే పిలిపించుకున్న జాషువా వారిని మరింతగా బెదిరించారు. ఎమ్మెల్యే చెప్పినట్లు వినకుంటే… రూ.50 కోట్ల జరిమానా కట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అన్న భావనతో కాస్తంత మెత్తబడ్డ యజమానులు రజినీకి రూ.2 కోట్లుముట్టజెప్పారు. ఇక అంతకుమించి ఇచ్చుకోలేని, తమను విడిచిపెట్టాలని వారు వేడుకోగా… రజినీ రూ.2కోట్లతోనే సరిపెట్టుకున్నారు.
ఇక మొత్తం వ్యవహారాన్ని చక్కపెట్టిన తమకు ఏమీ లేదా? అంటూ ఆరాలు పేరాలు తీసిన జాషువాకు రూ.10 లక్షలు, రామకృష్ణక రూ.10 లక్షలను సదరు కంపెనీ యజమానులు సమర్పించుకున్నారు. ఈ లెక్కన తమ తప్పు ఏమీ లేకున్నా… ఎమ్మెల్యే కన్నుపడ్డ పాపానికి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులు ఏకంగా రూ.2.20 కోట్లను అలా ఉచితంగా వదిలేసుకున్నారన్న మాట. దీనిపై తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ చేపట్టగా… రజినీతో పాటు జాషువా, రామకృష్ణలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఐపీఎస్ అధికారి అయిన జాషువాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ రేంజిలో కోట్లను కూడబెట్టిన రజినీ… ఇక మంత్రిగా కొనసాగిన రెండున్నరేళ్లలో ఇంకెంత సంపాదించి ఉంటారన్న దానిప ఆసక్తికర విశ్లేషణలు సాగతున్నాయి.