మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఏళ్ల తరబడి టీమిండియా కెప్టెన్సీలో అలా కుదురుకుపోయాడు. టీమిండియా కెప్టెన్ ధోనీ కొనసాగినంత కాలం దూకుడుగా ఆడే తత్వమున్న ఏ ఒక్క క్రికెటర్ కూడా కెప్టెన్ గా కొనసాగలేదనే చెప్పాలి. ఇందుకు నిదర్శనంగా గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిలిస్తే.. తాజాగా సచిన్ కంటూ దూకుడు కలిగిన విరాట్ కోహ్లీ ఆ వాదనకు మరింత బలం చేకూర్చాడు. టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లుగా కోహ్లీ గురువారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్ కెప్టెన్సీని వదిలేయనున్నట్లుగా అతడు ప్రకటించాడు.
సచిన్ బాటలోనే కోహ్లీ
గతంలో సచిన్ టెండూల్కర్ కూడా టీమిండియా కెప్టెన్ గా కొంతకాలం పాటు వ్యవహరించాడు. అయితే అప్పటికే తనదైన శైలి సత్తాతో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పిన సచిన్.. కెప్టెన్సీ బాధ్యతలు భుజానికెత్తుకున్న తర్వాత ఎందుకనో.. తనలోని దూకుడు తగ్గిపోవడం ప్రారంభించింది. ఈ విషయాన్ని రోజుల వ్యవధిలోనే గుర్తించిన సచిన్.. కెప్టెన్సీనే తన దూకుడును తగ్గించిందని తెలుసుకున్నాడు. అంతే.. ముందూవెనుకా ఆలోచించకుండా కెప్టెన్ గా తాను ఇక ఎంతమాత్రం కొనసాగలేదనని తేల్చి చెప్పాడు. ఆ తర్వాత కెప్టెన్ బాధ్యతల నుంచి బయటకు వచ్చాక.. సచిన్ లో మునుపటి దూకుడు పెరిగింది. మళ్లీ రికార్డుల వేటను ప్రారంభించాడు. అప్పటి సచిన్ మాదిరే ఇప్పుడు కోహ్లీ కూడా కెప్టెన్ గా ఓ మోస్తరుగా రాణిస్తున్నా.. కెప్టెన్సీ బాధ్యతలు అతడి ఆటను కాస్తంత మందగించేలా చేసిందనే చెప్పాలి. అందుకే కాబోలు.. గురువారం సాయంత్రం ఉన్నట్లుండి టీ20 కెప్టెన్సీని వదులుకోనున్నట్లుగా కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. అయితే వన్డే. టెస్టు జట్ల కెప్టెన్ గా కొనసాగుతానని కోహ్లీ ప్రకటించాడు. ఈ ప్రకటనను చూస్తుంటే.. త్వరలోనే కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- క్రికెట్ లో మరో కొత్త ఫార్మాట్.. ది 100