భారత క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్ గా చాలా కాలం నుంచి కొనసాగుతున్న రవి శాస్త్రికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. అదే సమయంలో ఆ పదవిలో ఎప్పుడెప్పుడు చేరతారా అంటూ క్రికెట్ లవర్స్ ఎదురు చూస్తున్న రాహుల్ ద్రవిడ్ కొత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే ఓ క్లారిటీతో ఉందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే అండర్ 19, భారత్ ఏ జట్లకు కోచ్ గా వ్యవహరిస్తున్న ద్రవిడ్.. ఇటీవలే శ్రీలంక టూర్ లో భారత జట్టుకు కోచ్ గా పనిచేశారు. రాహుల్ ద్రవిడ్ చీఫ్ కోచ్ గా రావడంతో భారత క్రికెట్ జట్టు మరింత మేర ఉత్తమ ప్రదర్శనను కనబరచనుందని, జట్టు మరిన్ని చిరస్మరణీయ విజయాలను సాధించనుందన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
2017 నుంచి కోచ్ గా..
2017లో భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి వయస్సు ప్రస్తుతం 59 ఏళ్లు. కోచ్ రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు. అంటే ఇప్పటికిప్పుడు కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి దిగిపోకున్నా.. ఇంకో ఏడాది తర్వాత అయినా ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిందే. ఇదే విషయంపై గత కొంతకాలంగా సమాలోచనలు చేస్తున్న బీసీసీఐ పెద్దలు.. రవిశాస్త్రిని తప్పించే దిశగానే చూస్తున్నారట. అదే సమయంలో రవిశాస్త్రి ఇప్పటికే బీసీసీఐకి తాను కోచ్ పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని చెప్పేశారట. దీంతో బీసీసీఐకి పెద్ద ఉపశమనం లభించినట్టేనని చెప్పాలి. చీఫ్ కోచ్ గా పదవి చేపట్టక ముందు టీమిండియా డైరెక్టర్ గా కొనసాగిన శాస్త్రి.. డైరెక్టర్ హోదాలో ఉంటూనే జట్టుకు కోచ్ గా పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్ పదవి నుంచి తప్పుకుని ఆ వెంటనే కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. రవిశాస్త్రి ఆధ్వర్యంలో జట్టు బాగానే రాణించినా చెప్పుకోదగ్గ ట్రోఫీలేమీ సాధించలేదు. ఐసీసీ ట్రోఫీలు ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించలేదు. అయితే ఓవరాల్ గా మాత్రం శాస్త్రి ఆధ్వర్యంలో భారత జట్టు మెరుగైన ప్రదర్శనే చేసిందని చెప్పాలి.
ద్రవిడ్ యుగం ఆరంభమైనట్టే
క్రికెటర్ గా రాహుల్ ద్రవిడ్ పేరిట మంచి రికార్డులే ఉన్నాయి. బ్యాట్స్ మన్ గా తనదైన శైలిలో క్రీజుకు అతుక్కుపోయే ద్రవిడ్ అను పెవిలియన్ చేర్చాలంటే ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టేవి. ఈ క్రమంలోనే జిడ్డు క్రికెటర్ గా విమర్శలు ఎదుర్కొన్న ద్రవిడ్.. టెస్టుల్లో మాత్రం భారత్ కు పెట్టని గోడ (వాల్) మాదిరే పరిణమించాడు. ఆ తర్వాత వన్డేల్లోనూ తనదైన శైలి ప్రదర్శన కనబరచిన ద్రవిడ్ జట్టుకు కొంత కాలం పాటు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. ఆ తర్వాత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే ద్రవిడ్ భావి క్రికెటర్లను తయారు చేసే పనిని భుజానికెత్తుకున్నాడు. ఈ క్రమంలో నేషనల్ క్రికెట్ అకాడెమీ డైరెక్టర్ గా అవకాశం దక్కించుకున్న ద్రవిడ్ కత్తుల్లాంటి కుర్ర క్రికెటర్లను తయారు చేశాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో మెరుపులు మెరిపిస్తున్న యంగ్ క్రికెటర్లంతా దాదాపుగా ద్రవిడ్ శిక్షణలో ఆరితేరిన వారే. ఈ క్రమంలో అండర్ 19, భారత్ ఏ జట్లకు కోచ్ గా వ్యవహరిస్తున్న ద్రవిడ్.. శాస్త్రి తప్పుకున్న వెంటనే భారత క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్ గా ఎంపిక కావడం ఖాయమే. ద్రవిడ్ లాంటి కోచ్ ను బీసీసీఐ వదులుకునే ప్రసక్తే లేదన్న మాటు వినిపిస్తున్నాయి.
Must Read ;- మిథాలీ రాజ్.. ది గ్రేట్ వుమెన్ క్రికెటర్