గుంటూరు జిల్లా, మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, బోండా ఉమాలకు మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం నాయకురాలు వంగలపూడి అనిత నేతృత్వంలో తెలుగు మహిళలు ఈ రోజు మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మకు, అనితకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమను కార్యాలయంలోకి అనుమతించకపోతే మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మనే బయటకు రావాలని డిమాండ్ చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించి వినతిపత్రం అందజేసేందుకు వస్తే ఛైర్మన్ కనీసం వారిని కలిసేందుకు కూడా సుముకత చూపకపోవడం పై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యాత్మ చేశారు.
తెలుగు మహిళలు కార్యాలయం ఎదుటే తమ ఆందోళనను కొనసాగిస్తుండడంతో పోలీసులు కొందరు మహిళలను కార్యాలయంలోనికి అనుమతించారు. వారు వాసిరెడ్డి పద్మకు వినతి పత్రం అందజేశారు. విజయవాడ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ మృగాళ్లతో పాటు అన్ని అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే మహిళా కమిషన్ ఛాంబర్‌లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ‘సీఎం జగన్ పాలనలో ఊరికో ఉన్మాది’ అనే పుస్తకాన్ని అనిత , వాసిరెడ్డి పద్మకు అందించారు.దీంతో వాసిరెడ్డి పద్మ అసహనానికి గురై ఇటువంటి ఆరోపణలు సరికాదని వారించారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 800కు పైగా అఘాయిత్యాలు జరిగాయి , వాటిలో ఎందరికి నోటీసులు ఇచ్చారని వాసిరెడ్డి పద్మను అనిత ప్రశ్నించారు. దీంతో ఆ పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానని వాసిరెడ్డి పద్మ అన్నారు.










