(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖలో రింగు వలల వివాదం పదేపదే రాజుకుంటోంది. కొద్ది రోజుల క్రితం పెదజాలరిపేటలో మత్స్యకార గ్రామాలకు చెందిన రెండు వర్గాలు ఇదే విషయమై ఘర్షణ పడ్డాయి. మళ్లీ శుక్రవారం కూడా రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సంప్రదాయ, రింగు వలల మత్స్యకారులు ఒకరితో ఒకరు తరచూ వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ వివాదానికి తెర దించుతూ మూడు రోజుల క్రితం మత్స్య శాఖ మంత్రి అప్పలరాజు ఒక పరిష్కారం సూచించినప్పటికీ.. వీరి మధ్య వివాదం మాత్రం సద్దుమణగలేదు.
ఏమిటీ ఈ రింగు వల?
మత్స్యకారులు చేపల వేట కోసం వివిధ రకాల వలలను వినియోగిస్తూ ఉంటారు. వీటిలో రింగు వల, బల్ల వల, అలీ వల, పోస, సదరమ్.. ఇలా అనేక రకాల వలలు ఉన్నాయి. కొన్ని సీజన్లలో మాత్రమే దొరికే కొన్ని రకాల చేపల కోసం ఒక రకమైన వల, సందువ కోసం మరో రకం.. కోనాం, సొర, వంజరం, కవ్వళ్ళు.. ఇలా వేటాడాల్సిన చేపల ను బట్టి వలలు సిద్ధం చేసుకుని సముద్రంలోకి అడుగుపెడతారు మత్స్యకారులు. పెద్ద చేపలను వేటాడాలనుకునే మత్స్యకారులు వలలో పడిన చిన్న చేపలు సముద్రంలోకి వెళ్ళి పోయేలా వలలు సిద్ధం చేసుకుంటారు. పెద్ద చేపల కోసం వేసిన వలల్లో చిన్న చేపలు చిక్కుకున్నా సముద్రంలోకి వెళ్లిపోయేందుకు ఉండే మార్గాన్ని కళ్ళు లేదా మెడ లేదా అచ్చులుగా మత్స్యకారులు పేర్కొంటారు.
వేటాడే చేప జాతిని బట్టి ఈ కళ్ళు సైజు ఉంటుంది. పెద్ద చేపల వేటాడే జాలర్లు చిన్న చేపలు అంతరించిపోకుండా వెళ్ళి పోయేందుకు వీలుగా వలలు తయారు చేస్తారు. సాధారణంగా పెద్ద చేపలు వేటాడే జాలర్లు mechanized బోట్ల సాయంతో వేట సాగిస్తుంటారు. ఇక మిగిలిన వాళ్ళు సంప్రదాయ మత్స్యకారులు. వీరు తీరం నుంచి ఐదారు కిలోమీటర్ల దూరం లోపలికి చిన్న బోట్లు, తెప్పలపై చేపల వేట సాగిస్తారు. ఇప్పుడు వీరి జీవనోపాధికి రింగు వలలు గండికొట్టే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో మత్స్యకారులు వద్ద అంతర్యుద్ధం జరుగుతోంది.
ఈ వలలు అన్నింటికీ భిన్నంగా రింగు వలలు పనిచేస్తాయి. కనీసం రెండు నుంచి 10 బోట్లు..15 నుంచి 50 మంది సిబ్బంది రింగు వలలతో సముద్రంలో వేటకు పూనుకుంటారు. ఈ వలల సాయంతో సుమారు అర కిలో మీటర్ వ్యాసార్థంలో ఉన్న నెత్తల్లు మొదలు.. భారీ చేపల వరకు చుట్టి పడేస్తారు. ఈ వలలు ఎంత వ్యాసార్థం ఉంటే ఆ పరిధిలో ఉన్న అన్ని జాతుల చేపలు ఈ వలలో ఇరుక్కుపోవలసిందే. చిన్న చేపలు తప్పించుకునేందుకు కూడా తగిన కళ్ళు ఈ తరహా వలలో కనిపించవు. గుండ్రంగా ఈ వలలతో చుట్టేయడం వల్ల చిన్న చిన్న చేపలు అధిక సంఖ్యలో చనిపోతూ ఉంటాయి. అదేవిధంగా పరిసరాల్లో సంప్రదాయ మత్స్యకారులకు చేపలు దొరకడం కూడా గగనమవుతోంది. ఈ కారణంగా సంప్రదాయ మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు.
ఎనిమిది కిలోమీటర్ల లోపు నిషేధం..
రింగు వలలు వినియోగించాలి అంటే… తీరం నుంచి ఎనిమిది కిలోమీటర్ల తరువాతే అనుమతి ఉంది. కానీ అనేక మంది మత్స్యకారులు.. నిబంధనలకు విరుద్ధంగా వేట కొనసాగిస్తూ ఉండడంతో… మత్స్యకారులు వర్గాలుగా విడిపోయి కొట్లాటలకు దిగుతున్నారు. ఇటీవల నగరానికి వచ్చిన ఆ శాఖ మంత్రి ఇరు వర్గాలతో చర్చలు జరిపి సమస్యను అక్కడితో ముగించాలని స్పష్టం చేశారు. కానీ రెండు రోజులు గడవక ముందే మళ్లీ రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధికి గండి పడటంతో పాటు… మత్స్య సంపద త్వరగా అంతరించిపోయే ఆస్కారం ఉన్నందున రింగ్ వలలను శాశ్వతంగా నిషేధించాలని మత్స్యకార సంఘాల నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు లేదా.. నిబంధన పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.