మాస్ మహారాజా హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్రాక్’ విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది. ఈరోజు ఉదయం పడాల్సిన 10 గంటల షోలు రద్దయ్యాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి.మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చాలాకాలంగా క్రాక్ విడుదల కోసం ఎదురుచూస్తూ ఉంది. అలాంటిది.. కరోనా దెబ్బకు మూతపడిపోయిన థియేటర్లు తిరిగి తెరుచుకున్న తర్వాత.. తొలిసారిగా విడుదలవుతున్న భారీ మాస్ చిత్రంగా క్రాక్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
శనివారం సినిమా విడుదల ప్లాన్ చేశారు. థియేటర్లలో టికెట్ల విక్రయాలు కూడా అంతా సజావుగానే జరిగాయి. కానీ మార్నింగ్ షో సమయానికి షో పడలేదు. టికెట్లు కొన్న వారికి థియేటర్ల వద్ద, టికెట్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు. సినిమా ఫైనాన్స్ కు సంబంధించిన వివాదాలు బ్రేకులు వేయడం వల్ల.. విడుదలకు అంతా సిద్ధం అయినప్పటికీ.. తెరమీద బొమ్మ పడలేదని సమాచారం. రవితేజ క్రాక్ సినిమా విడుదల వాయిదా పడటానికి ఆర్థిక సంబంధమైన కారణాలే కారణమని తెలుస్తోంది. దాంతో ఈరోజు కొన్ని ఆటలు రద్దు చేశారు.
చాలా షోలు రద్దయ్యాయి. ఈ రోజు 10 గంటలకు ప్రారంభం కావలసిని అన్ని ఆటలూ రద్దయ్యాయి. ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్నవారికి డబ్బులు వాపసు చేస్తామని ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆయా థియేటర్ల నుంచి షో రద్దయినట్టు మెసేజ్ లు రాకపోవడంతో టిక్కెట్టు బుక్ చేసుకున్న వారు థియేటర్లకు వెళ్లి నిరాశగా తిరిగి వచ్చారు. మళ్లీ షో ఎప్పుడు పడుతుందో చెప్పలేమని థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించారు. ఈ విషయం మీద నిర్మాత తరఫు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. సినిమా ఓవర్సీస్ లోనూ విడుదల కాలేదు. రవితేజ అభిమానులకు మాత్రం షాక్ కలిగించే అంశం. మరి నిర్మాతలు ఈ విషయంలో ఎందుకు అంత అజాగ్రత్తలో ఉన్నారో అర్థం కావడం లేదు. సాధారణంగా ఏ సినిమాకైనా నిర్మాతలు ఫైనాన్స్ తెచ్చి సినిమా నిర్మాణం చేపడుతుంటారు.
కరోనా కారణంగా సినిమా విడుదల దాదాపు 8 నెలలు వాయిదా పడటంతో వడ్డీలు కూడా తడిసి మోపెడవుతాయి. అలా కుదేలైన నిర్మాతలు కూడా చాలామందే ఉన్నారు. క్రాక్ కి కూడా ఇలాంటి సమస్యే ఏర్పడిందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఫైనాన్స్ క్లియర్ చేయకుండా సినిమా విడుదల సాధ్యం కాదు. ఒకప్పుడు సినిమా థియేటర్లకు బాక్సులు రాక వాయిదా పడేవి. ఇప్పుడు క్యూబ్ లాంటి సంస్థల వద్ద నుంచి ప్రసారాలు ఆగిపోతాయి. సంక్రాంతిలో రేసులో ఉన్న ఈ సినిమాకి మొదటిసారిగా ఆటంకం ఏర్పడింది.
Must Read ;- మాస్ మహారాజా డైరెక్టర్ గా మారతాడా?











