ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోగా పరిచయమై.. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు యువ హీరో కార్తికేయ. ఈ సినిమా తర్వాత గుణ 369, 90 ఎమ్ఎల్ తదితర చిత్రాల్లో నటించాడు. ఈ సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. తాజాగా ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా చేస్తున్నాడు. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి 19న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే.. ఈ సినిమాలో కార్తికేయ బస్తీలో ఉండే మాస్ కుర్రాడిగా నటిస్తున్నాడు. ఇందులోని పాత్ర కోసమే కార్తికేయ సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. కండలు తిరిగిన కార్తికేయ దేహాన్ని చూసి వావ్ అనకుండా ఉండలేరు. అంతగా సిక్స్ ప్యాక్ కోసం కష్టపడ్డాడు. కష్టపడ్డాడు అనే కంటే.. ఇష్టపడ్డాడు అని చెప్పచ్చు. ఎందుకంటే.. ఏదైనా ఇష్టంతో చేస్తేనే మంచి ఫలితం వస్తుంది. కార్తికేయ సిక్స్ ఫ్యాక్ బాడీకి సంబంధించిన ఫోటోలును ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో కార్తికేయ తన శరీరం పై పూర్తిగా దృష్టి పెట్టి ఇలా సిక్స్ ప్యాక్‌తో తన అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు అని చెప్పచ్చు.
సిక్స్ ప్యాక్ లుక్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇదంతా తన ట్రైనర్ వలనే సాధ్యమైందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు కార్తికేయ. ఆరడుగుల ఎత్తు.. కండలు తిరిగిన దేహంతో.. వెండితెర పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి ఎలాగైనా సరే.. సక్సస్ సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, గోపీచంద్, కళ్యాణ్ రామ్, సుధీర్ బాబు, రామ్ తదితరులు సిక్స్ ప్యాక్ బాడీ చూపించి ప్రేక్షకులకు అదిరిపోయే కిక్ ఇచ్చారు. ఇప్పుడు కార్తికేయ కూడా సిక్స్ ప్యాక్ తో వచ్చేస్తున్నాడు. మరి.. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న కార్తికేయకు చావు కబురు చల్లగా చిత్రం మంచి కబురు చెబుతుందని ఆశిద్దాం.
Must Read ;- హీరోల కండలు తిరగాలంటే అతనే ఫిట్ నెస్ గురు