త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. సమకాలీన రాజకీయాలపై త్రివిక్రమ్ సంధిస్తున్న వ్యంగాస్త్రంలా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కారణంగానే ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు‘ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లోనే త్రివిక్రమ్ తీరికలేకుండా ఉన్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్టును పూర్తిచేసుకుని ఎన్టీఆర్ వచ్చేలోగా తాను సిద్ధంగా ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని చెబుతున్నారు.
త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘అరవింద సమేత’ సినిమా భారీ వసూళ్లను రాబట్టడంతో, సహజంగానే తాజా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందువలన ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని వాళ్లంతా ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగును ఏప్రిల్ 2వ తేదీన మొదలుపెట్టాలని ఆలోచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20వ తేదీన ఈ సినిమా ఫస్టులుక్ ను .. స్పెషల్ టీజర్ ను వదిలితే బాగుటుందని ప్లాన్ చేస్తున్నారట.
హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజకీయనాయకుడిగా సంజయ్ దత్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడని చెబుతున్నారు. ఇక ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉండగా, ఒక కథానాయికగా జాన్వీకపూర్ పేరు వినిపిస్తోంది. మాటలు .. పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి త్రివిక్రమ్ ఆలోచన ఎలా ఉందో ఏమిటో?
Must Read ;- క్లైమాక్స్ షూటింగులో రాముడు భీముడు