టాలీవుడ్ లో ఏ దర్శకుడికీ లేనంత ఘోరమైన ట్రాక్ రికార్డు ఉంది మెహర్ రమేశ్ కి. చేసినవి నాలుగే నాలుగు సినిమాలు. పైగా అందులో నటించినవారు క్రేజీ స్టార్స్. ఈ నాలుగు సినిమాలు అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రభాస్ ‘బిల్లా’, యన్టీఆర్ ‘కంత్రీ, శక్తి’, వెంకీ ‘షాడో’ మెహర్ తెరకెక్కించిన సినిమాలు.
అలాంటి మెహర్ రమేష్ తో వర్క్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీ అవుతున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. అయితే చాలా మంది దీన్నో రూమర్ గా కొట్టిపడేశారు.
షాడో తర్వాత మళ్ళీ సినిమాల జోలికి పోని మెహర్ రమేశ్ కు చిరు ఛాన్స్ ఎందుకు ఇస్తారన్న సందేహంతో ఉన్నారు అభిమానులు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పిన మెహర్ కు .. చిరంజీవితో సినిమా చేస్తున్నందుకు అభినందనలని పవర్ స్టార్ రిప్లై ఇవ్వడం టాలీవుడ్ లో చర్చలకు దారి తీసింది. అందరు హీరోల్ని పడగొట్టినట్టే చిరంజీవిని కూడా తన స్టోరీ టెల్లింగ్ టాలెంట్ తో పడగొట్టేశాడని మెహర్ పై విమర్శలు ప్రారంభమయ్యాయి.
అయితే మెహర్ రమేశ్ చిరంజీవితో తీయబోయేది సూపర్ హిట్టు తమిళ రీమేక్ ‘వేదాళం’ కావడంతో .. అభిమానులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా కోలీవుడ్ లో దుమ్మురేపేసింది. శివ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో పుష్కలమైన యాక్షన్ సీక్వెన్సెస్ తో నిండి ఉంటుంది. ఈ సినిమా మెగాస్టార్ కు సరిపోయే సబ్జెక్టే. కానీ అతగాడి దర్శకత్వ ప్రతిభపై అపనమ్మకం ఉన్న కొందరు మాత్రం చిరంజీవి మెహర్ కు ఛాన్సిచ్చి.. రిస్క్ చేస్తున్నారని భావిస్తున్నారు.
ప్రభాస్ తో తీసిన ‘బిల్లా’ కూడా తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్టు సినిమానే. కానీ తెలుగులో బోల్తా కొట్టడంతో ఇప్పుడు .. అదే మెహర్ రమేశ్ తో .. మళ్ళీ అజిత్ సినిమా రీమేక్ అనేసరికి.. మరో యాంగిల్ లో దాన్ని నెగెటివ్ సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు అభిమానులు. మెగాస్టార్ ఫ్యామిలీతో మెహర్ రమేష్ కు బంధుత్వం ఉండడంతో .. అతడు ఆ రూట్లో నరుక్కుని వచ్చాడని .. చిరంజీవి కూడా బంధువనే ఉద్దేశంతోనే అతడికి ఛాన్స్ ఇచ్చారని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. మరి ‘వేదాళం’ తో మెగాస్టార్ ను ఏ రేంజ్ లో మెహర్ ఆవిష్కరిస్తాడో చూడాలి.