కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిపాదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనన్న ప్రధాన డిమాండ్ తో సాగుతున్న రైతుల ఉద్యమానికి బుధవారంతోనైనా తెర పడుతుందా? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే ఐదు దఫాలుగా జరిగిన చర్చలు ఫలితాన్నివ్వకపోగా… ఆరోసారి కూడా రైతులకు అనుకూలంగా కేంద్రం నుంచి స్పందన వచ్చేలా కనిపించడం లేదన్నమాటే గట్టిగా వినిపిస్తోంది. వెరసి ఆరోసారి చర్చల్లోనూ ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిరేలా లేదన్న వాదన వినిపిస్తోంది.
వ్యవసాయమే ప్రధానంగా సాగుతున్న భారత్ లో వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ విషయంలో కొత్త సంస్కరణలతో రైతుకు మరింత మేర ఆదాయం అందిస్తామన్న మాటతో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. మూడు కొత్త చట్టాలను రూపొందించింది. పార్లమెంటులో తన పార్టీకి ఉన్న బలం నేపథ్యంలో ఈ ప్రతిపాదనలను ఎన్డీఏ సర్కారు ఈజీగానే ఆమోదింపజేసుకుంది. అయితే ఇలా పార్లమెంటులో కొత్త చట్టాలకు ఆమోదం రాగానే.. అటు దేశ రైతాంగం ఆందోళన బాట పట్టింది.
కొత్త చట్టాలతో సాగు రంగం రూపు రేఖలు మారిపోవడం ఖాయమేనని, అయితే ఆ మార్పులు అన్నదాతలకు లాభదాయకం కాకపోగా… రైతులను సర్వనాశనం చేసేస్తాయని, బడా వ్యాపారవేత్తలకు మాత్రమే ఈ చట్టాలతో లబ్ధి చేకూరుతుందని అన్నదాతలు రోడ్డెక్కారు. నెల రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దులను చుట్టుముట్టేసిన అన్నదాతలు మోదీ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తొలుత రైతుల ఆందోళనలను ఈజీగానే తీసుకున్న మోదీ సర్కారు… అంతకంతకూ రైతుల ఆందోళనలు మరింత ఉధృతం కావడంతో దిగిరాక తప్పలేదు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చిద్దాం రండి అంటూ మోదీ సర్కారు నుంచి అందిన పిలుపు మేరకు రైతులకు కూడా సానుకూలంగానే స్పందించారు. ఇందులో భాగంగా ఇప్పటిదాకా ఐదు దఫాలుగా చర్చలు సాగినా… ప్రతిష్టంభన తొలగలేదు కదా… మరింత సంక్లిష్టంగా మారిపోయింది. అసలు ఈ సమస్య సద్దుమణుగుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. మొత్తంగా ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా రైతుల ఆందోళనలు, అవి సద్దుమణిగే దిశగా కేంద్రం తీసుకుంటున్న చర్యలపైనే చర్చ జరుగుతోంది. ఇలాంటి క్రమంలో ఈ నెల 30న (బుధవారం) మరోమారు చర్చలకు రావాల్సిందిగా రైతు సంఘాల నేతలకు కేంద్రం కబురు పంపింది. ఇందుకు రైతుల నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చింది. అయితే తాము కోరుతున్నట్లుగా మూడు కొత్త సాగు చట్టాలను బేషరతుగా రద్దు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తేనే చర్చలకు వస్తామన్న అన్నదాతలు… ఆ దిశగా కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకుండానే చర్చలకు సిద్ధమయ్యారు. అయితే చర్చల ఎజెండాలో కొత్త చట్టాల రద్దు అంశాన్ని చేర్చకున్నా ఫరవా లేదు గానీ.. సమావేశంలో మాత్రం ఆ అంశంపై తప్పనిసరిగా చర్చ జరగాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే కొత్త చట్టాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్న కేంద్రం.. ఆది నుంచి చెబుతున్న పాత పాటనే మళ్లీ వల్లె వేసేందుకు సిద్ధమైంది. కొత్త సాగు చట్టాలతో రైతులకు ఒనగూరే ప్రయోజనాలను మరింతగా విశదీకరించి చెప్పడంతో పాటుగా సదరు చట్టాలపై రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకే కేంద్రం సిద్ధమైనట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే చర్చలకు ఒకరోజు ముందుగా మంగళవారమే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… మరో ఇద్దరు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ తో కీలక సమావేశం నిర్వహించారు. బుధవారం నాటి సమావేశంలో రైతులతో చర్చించాల్సిన అంశాలపై ఓ అవగాహనకు వచ్చేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించినట్లుగా సమాచారం. అంతేకాకుండా సమావేశంలో రైతుల నుంచి దూసుకువచ్చే ప్రశ్నలకు ఎలా స్పందించాలి? వాటికి ఏ రీతిన బదులివ్వాలి? అంతిమంగా కొత్త సాగు చట్టాలపై రైతులను ఎలా ఒప్పించాలన్న దానిపైనే అమిత్ షా తన సహచర మంత్రులకు గీతోపదేశం చేసినట్లుగా సమాచారం. మరోవైపు రైతులు మాత్రం కొత్త సాగు చట్టాలను రద్దు చేయడం మినహా… మరే ప్రత్యామ్నాయాన్ని అంగీకరించేది లేదని తెగేసి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోసారి చర్చల్లో కూడా ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.











