విజయవాడ సెంట్రల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజరెడ్డిని విధులనుంచి సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు. ఏసీపీ మీద వచ్చిన ఆరోపణల విషయంలో శాఖాపరమైన దర్యాప్తు జరిగింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో.. నాగరాజు రెడ్డిని సస్పెండ్ చేశారు.
ఇంతకూ ఏం జరిగిందంటే..
విజయవాడ పడమటలోని ఓ భవననిర్మాణ పనులు జరుగుతుండగా… ఒక కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. దీనిపై గొడవ జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి బిల్డర్ సుధాకర శర్మనుంచి ఏసీపీ నాగరాజురెడ్డి భారీ మొత్తం డబ్బు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. బిల్డర్ సుధాకర్ శర్మ స్వయంగా, డబ్బులు డిమాండ్ చేసారంటూ ఏసీపీపై ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. శాఖాపర విచారణ చేసి చర్యలు తీసుకొన్న డీజీపీ ఆయనను సస్పెండ్ చేశారు.
కులపిచ్చి ఉంటే ఇలా జరుగుతుందా?
సస్పెండయిన ఏసీపీ నాగరాజు రెడ్డి కావడంతో.. వైసీపీ వారు కొత్త వాదన తెస్తున్నారు. మా ప్రభుత్వానికి కుల పిచ్చి ఉంటే ఇలా రెడ్డి వర్గం వ్యక్తి సస్పెండ్ అవుతారా అంటున్నారు. తప్పు చేశాడు గనుక సస్పెండయ్యాడని.. ఇక్కడ కులానికి తావులేదని సమర్థించుకుంటున్నారు.