టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఫుల్ హ్యాపీగా గడపారు. అదేంటీ… చంద్రబాబు ఎప్పుడూ హ్యాపీగానే కనిపిస్తారు కదా… ఈ శుక్రవారం కొత్తగా ఫుల్ హ్యాపీగా కనపించడమేమిటీ అంటారా? తన కలల రాజధాని అమరావతిని రానున్న మూడేళ్లలో ఎలాగైనా పూర్తి చేయాల్సందేనన్న దిశగా ఓ ధృడ సంకల్పంతో సాగుతున్న ఆయనకు శుక్రవారం నాడు ఓ తీపి కబురు అందింది. అమరావతి నిర్మాణానికి వివిధ ఆర్థిక సంస్థలతో రూ.15 వేల కోట్లను రుణంగా అందిస్తామన్న కేంద్రం హామీ మేరకు ప్రపంచ బ్యాంకుతో పాటుగా ఏసియా డెవలప్ మెంట్ బ్యాంకు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థలు కలిపి రూ.15 వేల కోట్లను అమరావతి నిర్మాణం కోసం ఏపీకి అప్పుగా ఇచ్చేందుకు అన్ని అనుమతులు వచ్చేశాయి. ఇప్పటికే ఏసియా డెవలప్ మెంట్ బ్యాంకు అన్నిఅనుమతులను మంజూరు చేయగా… శుక్రవారం ప్రపంచ బ్యాంకు కూడా అప్పు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ వార్త నిజంగానే చంద్రబాబుకు గుడ్ న్యూస్ గానే పరిగణించాలి.
2014లో రాజధాని కూడా లేకుండా నూతన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీకి… పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు సీఎం అయితేనే బాగుంటుందన్న ఏపీ ప్రజలు ఆయనకే అధికార పగ్గాలు అప్పగించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన సాగించిన చంద్రబాబు…రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతిని రాజదానిగా ఎంపిక చేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన అమరావతి రైతులు బంగారం పండే తమ పంట పొలాలను అమరావతి నిర్మాణానికి త్యాగం చేశారు. వారికి ఇచ్చిన హామీ మేరకు రాజధానిలో వారికి రిటర్నబుల్ ఫ్లాట్లతో పాటుగా ఆ ఫ్లాట్లు వారి చేతికి దక్కేదాకా ఆయా పంట భూములకు కౌలును కూడా చంద్రబాబు అందించారు.
తొలి ఐదేళ్లలోనే రాజధానికి ఓ రూపు తీసుకువచ్చే దిశగా కృషి చేసిన చంద్రబాబు… అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయం, హైకోర్టు భవనాలను నిర్మించారు. ఇక ఉద్యోగుల వసతి కోసం నిర్మాణాలనూ మొదలుపెట్టారు. నగరంలో రోడ్లను ఏర్పాటు చేసే కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు. మొత్తంగా తొలి ఐదేళ్లలోనే రాజధాని పనులను చంద్రబాబు పరుగులు పెట్టించారు.
అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ వైపు మొగ్గు చూపారు. ఫలితంగా చంద్రబాబు తలచిన రాజదాని నిర్మాణం దాదాపుగా అటకెక్కింది. రాజధాని అమరావతి ఉనికినే ప్రశ్నార్థకం చేసే దిశగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను పంటి బిగువన భరిస్తూ వచ్చిన చంద్రబాబు… మొన్నటి ఎన్నికల దాకా కష్టమైనా భరించారు. తాను అనుకున్నట్లుగానే… మొన్నటి ఎన్నకల్లో అమరావతి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలు తిరిగి చంద్రబాబుకే అధికార పగ్గాలు ఇచ్చారు. దీంతో ఈ దఫా ఎలాగైనా రాజధానిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో సాగుతున్న చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కేంద్రం వద్ద అమరావతి ప్రతిపాదనలు పెట్టారు.
అంతేకాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకుని వచ్చి మరీ అమరావతికి ఆర్థిక తోడ్పాటు అందించే దిశగా ప్రధాని మోదీని ఒప్పించారు. ఈ క్రమంలో రుణానికి గ్యారెంటీ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించగా… ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకులు రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపియన్ డెవలప్ మెంట్ బ్యాంకు 788 మిలియన్ డాలర్ల రుణానికి ఆమోద ముద్ర వేసింది. తాజాగా శుక్రవారం ప్రపంచ బ్యాంకు కూడా 800 మిలియన్ డాలర్ల రుణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెరసి చంద్రబాబు ఫుల్ ఖుషీ అయ్యారని చెప్పక తప్పదు.