అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన వైసీపీ ఉనికి కోసం పాకులాడుతోంది. ఏదో ఓ అంశాన్ని ఎత్తుకుని రచ్చ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 5న ఫీజు పోరు పేరుతో ఆందోళనలు చేయడానికి సిద్ధమైంది. ఫీజు పోరు పేరుతో ఫిబ్రవరి 5న ఆందోళనలు చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు వైసీపీ అధినేత జగన్. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేశారు.
ఐతే జగన్ తీరుపై చాలా మంది వైసీపీ కీలక నేతలు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. సమయం,సందర్భం లేకుండా ఆందోళనలు చేయాలని ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పు పడుతున్నారు. జగన్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందు విద్యుత్ ఛార్జీల పోరు, రైతు పోరు, ఇప్పుడు ఫీజు పోరు నిర్వహించాలని పిలుపునివ్వడం సరికాదంటున్నారు. గతంలో నిర్వహించిన రైతు పోరు, విద్యుత్ ఛార్జీల పోరుకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు రాలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ రెండు కార్యక్రమాలు ఫ్లాప్ అయ్యాయంటున్నారు వైసీపీ నేతలు.
ఇప్పుడు ఫీజు పోరు విషయంలోనూ ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించే అవకాశాలు లేవంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ హయాంలో పెండింగ్‌లో ఉంచిన విద్యా దీవెన రూ.800 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ధర్నాలు సరికాదంటున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఫెయిల్ అవుతుంటే..అందుకు కారణాలపై విశ్లేషణ జరపకుండా మొండిగా మరోసారి ధర్నాలకు దిగమనడం సరికాదంటున్నారు. కూటమికి కనీసం ఏడాది కాలమైనా టైం ఇవ్వాలని సూచిస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన టైంలోనూ ఏడాది పాటు పథకాలు అమలు చేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూశాక..ఓటమికి గల కారణాలపై నేతలతో జగన్ చర్చించలేదు. ప్రజల్లోకి కూడా వెళ్లలేదు. అనుకూల మీడియా ముందు తానుంటే ఇలా జరిగేది కాదని, సంక్షేమ పథకాలను ఆపేవాడిని కాదని జగన్ చెప్తున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన ఉంటుందని జగన్ ప్రకటించారు. కానీ తన కూతురు స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లారు జగన్ దంపతులు. ఫిబ్రవరి 4న జగన్ పర్యటనలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తారని చెబుతున్నప్పటికీ..పార్టీ నేతల్లో నమ్మకం కలగడం లేదు. ఇక జగన్ లండన్‌లో ఉండగానే పార్టీలో నెంబర్ 2గా చెలామణి అయిన విజయసాయిరెడ్డి రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా విషయాన్ని లండన్ పర్యటనలో ఉన్న జగన్‌కు ఫోన్ చేసి చెప్పానన్నారు విజయసాయిరెడ్డి. ఐతే ఈ రాజీనామాపై జగన్ ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.