YCP MLA Sambangi Venkatachina Appala Naidu Severely Humiliated :
ఏపీలో ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఘోర పరాభవం తప్పడం లేదు. ఏ చిన్న శంకుస్థాపన చేయాలన్నా వైసీపీ నాయకులు బెదిరిపోతున్నారు. భారీ భద్రత మధ్య ప్రజల్లోకి వెళ్లి తూతూమంత్రంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడుకు పట్ట పగలే చుక్కలు కనిపించాయి. జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు ఆయన ఏకంగా పోలీసుల జీపులో దాదాపుగా రెండు గంటల పాటు దాక్కుని మరీ బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. జనం నిరసనలతో బెంబేలెత్తిన చినప్పలనాయుడు పరుగెత్తిన తీరు, జనం నుంచి తప్పించుకునేందుకు చేసిన యత్నాలు.. చివరకు పోలీసు జీపులో దాక్కున్న తీరు వైసీపీ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమనే చెప్పక తప్పదు.
అసలేం జరిగింది?
పేదల ఇళ్ల శంకుస్థాపన కోసం విజయనగరం జిల్లా కొండకెంగువ గ్రామానికి వచ్చారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అనర్హులకు ప్రాధాన్యం ఇచ్చారని గ్రామస్తులు గొడవకు దిగారు. పలు సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. వైసీపీ నాయకులకే పట్టాలిస్తారా? అంటూ ప్రశ్నించారు. గ్రామస్తులంతా ఆయనను చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, భారీ భద్రత మధ్య ఎమ్మెల్యేను శంకుస్థాపన చేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. న్యాయం చేయకుండా ఎలా శంకుస్థాపన చేస్తారంటూ అక్కడ కూడా మహిళలు, యువకులు ఎమ్మెల్యేకు అడ్డుపడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో గ్రామస్తులంతా టెంట్లు, కుర్చీలను ధ్వంసం చేసి రాళ్లతో ప్రతిదాడికి దిగారు. ఈ ఘటనలో ఒక పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసుల జీపులోనే ఎమ్మెల్యే
గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎమ్మెల్యే ఎటూ పోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎమ్మెల్యే పోలీసుల జీపులోనే దాక్కున్నారు. ప్రాణభయంతో దాదాపు రెండు గంటల పాటు జీపులోనే ఉన్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా పోలీసులు వచ్చారు. భారీ భద్రత మధ్య ఎమ్మెల్యే చినప్పలనాయుడు అక్కడనుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన ఘటనపై చినప్పలనాయుడు స్పందించారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే గ్రామంలో అడుగుపెట్టాలని హెచ్చరించారు. ఆతర్వాత ఎమ్మెల్యే స్పందిస్తూ దాడులు చేయడం తగదని, అర్హులైన పేదలందరికీ పట్టాలిస్తామని మీడియాకు వెల్లడించారు.
Must Read ;- ‘పెద్దల రోడ్డు’కు అడవిని అడ్డంగా నరికారు..!