Unknown Facts About Director Viswanath :
సాహిత్యం నుంచి సంగీతం వరకు, స్ర్కిప్ట్ నుంచి సెట్స్ వరకు సినిమాను నరనరానా జీర్ణించుకున్న అపురూప దర్శకుడు.. తెలుగునాట పుట్టడం తెలుగు సినీ ప్రియులు చేసుకున్న అదృష్టం. సినిమా రీళ్ల నిండా సంప్రదాయాన్ని నింపి తెలుగువారి లోగిళ్లలో మంజీరనాధం వినిపించేలా చేసిన మహా తపస్వి. సంగీతానికి వర్షం కురుస్తుందో లేదో గానీ.. తెర మీద ఈ కళాస్రష్ట చూపిన ప్రతిభకు ఎడతెరిపిలేని కన్నీళ్లు.. ఆగని ఆనంద భాష్పాలు రాలిన మాట వాస్తవం. అందుకే ఆయనకు బిరుదొక్కటి చాలు అదే కళాతపస్వి.
కె.విశ్వనాథ్ పేరు చెప్పగానే ఒక తరహా సినిమాలు రీళ్లు రీళ్లుగా కళ్ల ముందు మెదిలాడుతాయి. మనసును రంజింపచేసి హృదయాన్ని ఉప్పొంగేలా చేస్తాయి. చరిత్రలో మమాన్నతంగా నిలిచిపోయిన ఈ కళాతపస్వి.. కాళీనాధుని విశ్వనాథ్ 1930న విజయవాడలో జన్మించారు. తండ్రి పేరు సుబ్రమణ్యం. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయంలో మేనేజర్ గా వర్క్ చేస్తుండేవారు. తండ్రి చేసే ఉద్యోగంతో ఏమాత్రం సంబంధం లేనట్టుగా కనిపించే విశ్వనాథ్ 1948లో సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే. విశ్వనాథ్ లోని లోపలి మనిషి అతను మద్రాసు వెళ్లే వరకు ఎవరికీ తెలియదు. మద్రాసు వెళ్లి వాహినీ స్డూడియోలో చేరారు. అక్కడే సినిమా రంగం నుంచి పూర్తి స్ధాయిలో తెలుసుకున్నారు. రికార్డింగ్, రీ రికార్డింగ్, సౌండ్, కెమెరా.. ఇలా సినిమా రంగంలోని అన్నింటికి గురించి తెలుసుకున్నాకే తనేంటో నిరూపించుకున్నారు.
Director Viswanath Filmography :
‘గుణసుందరి కథ’ (1949) సినిమా నిర్మాణ సమయంలో కె. విశ్వనాథ్ మద్రాస్‌లోని వాహినీ స్టూడియోలో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. సరిగ్గా ఆ టైమ్‌లోనే ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు ‘షావుకారు’ సినిమాకు బుక్ అయ్యారు. అంటే వారంతా దాదాపు ఒకేసారి తమ కెరీర్‌ను ప్రారంభించారన్న మాట. లెజెండరీ డైరెక్టర్ అయిన బి.ఎన్. రెడ్డికి విద్యావంతులైన యువకులను చేరదీసి, సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారిలో టాలెంట్ ఉన్నవాళ్లను తన దగ్గర దర్శకత్వ శాఖలోకి తీసుకోవాలని ఉండేది. ఆ విధంగానే విశ్వనాథ్‌ను వాహినీ సంస్థలో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకున్నారు. సినీ రంగంలోని చాలా మందికి కూడా తెలీని విషయమేమంటే, వాహినీ పిక్చర్స్‌లో విశ్వనాథ్ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం కూడా పనిచేశారు. ఆయన బి.ఎన్. రెడ్డికి సమకాలికులు.
1938 నుంచి అంటే ‘వందేమాతరం’ చిత్రంతో వాహినీ సంస్థ ఆరంభమైనప్పట్నుంచీ ఆ సంస్థలో సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఈ అనుబంధం కారణంగానే విశ్వనాథ్‌ను బి.ఎన్. రెడ్డి మొదట టెక్నీషియన్‌గా ఎంచుకొని, తర్వాత దర్శకత్వ శాఖలోకి తీసుకోవాలని అనుకున్నారు. ‘బంగారు పాప’, ‘మల్లీశ్వరి’ లాంటి క్లాసిక్స్ నిర్మిస్తున్నప్పుడు దర్శకులు కె.వి. రెడ్డి, బి.ఎన్. రెడ్డి వద్ద, ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్‌ట్లీ వంటి వారి సాహచర్యంలో విశ్వనాథ్ పనిచేశారు.
సౌండ్ రికార్డింగ్ అన్నది సినిమా నిర్మాణంలో ఒక విభాగం. కానీ, డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు రీరికార్డింగ్‌ను కూడా ధైర్యంగా విశ్వనాథ్‌కు అప్పగించి వెళ్లేవారు. ఆయనకు డైరెక్షన్ మీద ఉత్సాహం ఉందనే అభిప్రాయంతోనే ఆదుర్తి ఆ పనిచేసేవారు. ‘స్వప్నసుందరి’, ‘లైలా మజ్ను’, ‘తోడికోడళ్లు’ లాంటి సినిమాలకు సౌండ్ రికార్డిస్ట్‌గా పనిచేయడంతో అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం కాస్తా సాన్నిహిత్యంగా మారింది. అన్నపూర్ణా పిక్చర్స్ వాళ్ల ‘తోడికోడళ్లు’, ‘మాంగల్య బలం’, ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలను వాహినీలోనే తీశారు. దాంతో అక్కినేని, విశ్వనాథ్ బాగా సన్నిహితులయ్యారు.
ఇక ఆదుర్తికి విశ్వనాథ్ ఎంత దగ్గరయ్యారంటే.. వాహినీలో రికార్డిస్టుగా ఉన్నప్పుడు ఆదుర్తి సొంత చిత్రం ‘మూగమనసులు’ స్క్రిప్టు డిస్కషన్స్‌లో ప్రతిరోజూ ఆఫీసు అవగానే సాయంత్రం పూట పాల్గొనేవారు విశ్వనాథ్. ఆ తర్వాత ఆదుర్తికి అసోసియేట్‌గా అన్నపూర్ణ సంస్థలో చేరారు. అందులో నాలుగేళ్లు వర్క్ చేశారు విశ్వనాథ్. అప్పుడు ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘డాక్టర్ చక్రవర్తి’ లాంటి సినిమాలకు పనిచేశారు. ‘మూగమనసులు’కు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా చేశారు. ‘తేనె మనసులు’ చిత్రానికి ఎంపికైన కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి తదితర నటులకు ట్రైనింగ్ ఇవ్వడంలో పాల్గొన్నారు. 1966లో అక్కినేని హీరోగా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ‘ఆత్మగౌరవం’తో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు విశ్వనాథ్.
ఆత్మగౌరవం సినిమా విడుదలైంది. రాష్ట్రమంతా హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతో నంది (కాంస్య) అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. అలా.. మొదలైన విశ్వనాథ్ కెరీర్ లో ఎన్నో మలుపులు, మరెన్నో ఘట్టాలను చవి చూసింది. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని విధంగా కళాతపస్వి అనే బిరుదును ఆపాదించింది.
Also Read :- ఏయన్నార్ స్థానంలో శోభన్ బాబుకు చోటు