ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ రెడ్డి ఢిల్లీ టూర్ హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఇప్పటికే ఓ సారి ప్రధాని మోదీని కలిసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతీ రెడ్డి ప్రధాని అపాయింట్ మెంట్ కోరడం, ప్రస్తుత ప్రభుత్వం కీలకంగా ఉన్న ఓ అధికారి బదిలీ అయ్యాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇక అసలు విషయానికి వస్తే..వైఎస్ భారతి ప్రధానిని లేదా కేంద్ర ప్రభుత్వంలోని ఇతర పెద్దలను ఎందుకు కలుస్తున్నారు అనే అంశంపై పలు విశ్లేషణలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఇటు టీడీపీతో పాటు మరికొందరు నాయకులు ఓ అంశంపై చేస్తున్న ప్రచారం ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు కేసులు నమోదైన నేపథ్యంలో జగన్ జైలుకు వెళ్తాడని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే భారతీ రెడ్డి సీఎం అవుతారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. కేసుల విషయం చర్చించేందుకేనని కూడా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ పై ఏపీ సీఎం జగన్ పలు ఆరోపణలు చేస్తూ చీఫ్ జస్టిస్ కు కొన్నాళ్ల క్రితం లేఖ రాశారు. న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం ఉందని పరోక్షంగా ఆ లేఖల సారాశం. ఈ నేపథ్యంలో తమపై ఉన్న కేసుల విషయంపై చర్చించేందుకు కేంద్రంలోని పెద్దలను కలిసే సాహసం చేస్తారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
జగన్ జైల్లో ఉన్న టైంలో..
వైఎస్ భారతీ రెడ్డి ప్రధాని మోదీతోపాటు కేంద్రంలోని పెద్దలతో సమావేశం అంశంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఆ విషయం పక్కన పెడితే గతంలో అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్, ఆయన కంపెనీలకు చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేసిన విజయసాయిరెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో భారతీ రెడ్డి ఎలా వ్యవహరించారనే అంశం తెరపైకి వస్తోంది. వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పెట్టారు. అప్పటినుంచి కుటుంబ పరంగా, రాజకీయపరంగా భారతీ రెడ్డి జగన్ కు అండగా ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లిన సమయంలో భారతీరెడ్డి సమర్థవంతంగా అటు పార్టీ కార్యకలాపాలను, ఇటు కంపెనీలను, అదే సమయంలో కుటుంబ బాద్యతలనూ సమర్థవంతంగా నిర్వర్తించారని చెప్పవచ్చు. ఓవైపు భర్తను కోల్పోయి..కుమారుడు జైలుకు వెళ్లిన బాధలో ఉన్న వైఎస్ విజయమ్మకు ధైర్యం చెప్పి.ప్రజల్లోకి వచ్చేలా చేయగలిగారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. వైఎస్ జగన్ జైలుకి వెళ్లిన సమయంలో జగనన్న వదిలిన బాణంగా వైఎస్ షర్మిల పాదయాత్రను కొనసాగించారు. అన్నకోసం షర్మిల పాదయాత్ర చేసినా.. షర్మిలకు కావాల్సిన మోరల్ సపోర్ట్ భారతీరెడ్డి ఇచ్చారని అప్పట్లో ఆ పార్టీ వారే చర్చించుకున్నారు. జగన్ కు బెయిల్ కోసం ఓ వైపు ప్రయత్నిస్తూనే..మరోవైపు కంపెనీలను చూసుకోగలిగారు. సాక్షి పేపర్ ను, సాక్షి ఛానెల్ ను కూడా కాపాడుకోగలిగారు. రెవెన్యూ పరంగా ఇబ్బందులు వచ్చినా..సర్కూలేషన్ పరంగా, ప్రచారపరంగా ప్రత్యర్థి మీడియాకు ధీటుగా ఉండేలా చూడగలిగారు. ఇవన్నీ ఆమె ఒక్కరే చేయగలిగారా అంటే..కాకపోవచ్చు..కాని నాయకత్వం వహించారని చెప్పవచ్చు. అందుకే ఆ కుటుంబంలో భారతీ రెడ్డికి ఉన్న ప్రాధాన్యం వేరు. ఓ వైపు కేసులు ఎదుర్కోవడం, కంపెనీల ఆర్థిక లావాదేవీలపై పర్యవేక్షణ, కుటుంబాన్ని నడిపించడం, పార్టీ విషయాల్లో తన పాత్ర పోషించడం..ఇలా ఏక సమయంలోనే భారతీ రెడ్డి.. పలు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అప్పట్లో వైసీపీకి చెందిప నాయకులే చర్చించుకున్నారు.
ప్రస్తుతం జగన్ ఏపీకి సీఎం అయ్యారు. అయినప్పటికీ కుటుంబ సమేతంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ ..తన సతీమణి భారతీ రెడ్డికి ఇచ్చే ప్రాధాన్యం బయటకు కనిపిస్తూనే ఉంటుంది.