పోరాడితేనే విజయం దక్కుతుంది .. విశ్రాంతి తీసుకుంటే విజయమనేది వీలైనంత దూరం జరుగుతుంది. తీరా విజయం సొంతమయ్యాక దానిని కొనసాగించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. లేదంటే మొదటి మెట్టు దగ్గర నుంచే మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. అందాల కథానాయిక శ్రుతిహాసన్ ఇప్పుడు చేస్తున్న పని అదే. తమిళ .. తెలుగు భాషల్లో చాలా నిదానంగా శ్రుతిహాసన్ తన కెరియర్ ను మొదలెట్టింది. ఆరంభంలో విజయాలు దక్కకపోవడంతో, ‘ఐరన్ లెగ్’ అనిపించుకుంది. అప్పటి నుంచి కెరియర్ పరంగా ఆమె మరింత పట్టుదలతో అడుగులు వేసింది.
శ్రుతిహాసన్ పడిన కష్టానికి ప్రతిఫలంగా ఒక్కో విజయం ఆమెను పలకరిస్తూ రావడం మొదలైంది. తమిళ .. తెలుగు సినిమాల్లో లభించిన విజయాలు ఆమెకి స్టార్ స్టేటస్ ను కట్టబెట్టాయి. ఈ రెండు భాషల్లోను తమలపాకు లాంటి ఈ అమ్మాయిని ఆరాధించని అబ్బాయిలు లేకుండా పోయారు. స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఆమెను సిఫార్స్ చేశారు .. ఆమె పారితోషికం పెంచినా నిర్మాతలు వెనుకాడలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె తెలుగు .. తమిళ భాషల్లోని అవకాశాలను పక్కన పెట్టి, హిందీ సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఆ తరువాత లవ్ లో పడి, అక్కడ అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేసింది. దాంతో శ్రుతిహాసన్ తనే అవకాశాల కోసం ఎదురుచూడవలసిన పరిస్థితి ఏర్పడింది.
మొత్తానికి శ్రుతిహాసన్ నిరీక్షణ ఫలించి తెలుగులో రవితేజ జోడీగా ‘క్రాక్’ సినిమాలోను, తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘లాబం’ సినిమాలోను అవకాశం దక్కింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘క్రాక్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎస్.పి. జననాథన్ దర్శకత్వం వహిస్తున్న ‘లాబం’ కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ రెండు సినిమాలపైనే శ్రుతిహాసన్ ఆశలు పెట్టుకుంది. క్రేజ్ వున్నప్పుడు కెరియర్ ను నిర్లక్ష్యం చేసిన ఆమె, తిరిగి అప్పటి క్రేజ్ ను అందుకోగలుగుతుందా అనేది చూడాలి. అందుకే పెద్దలు ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్నారు .. లేకపోతే ఇలాగే ఉంటుంది మరి.
Also Read ;- శ్రుతిహాసన్ ‘మిస్సింగ్’ గోలేంటి?