వైసీపీ కార్యకర్త, దళితుడు సింగయ్య మృతి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో A-2గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఉపయోగించిన బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు సీజ్ చేశారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన పోలీసులు…నోటీసులు ఇచ్చారు.
స్వయంగా జగన్‌కు నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో వైసీపీ ఆఫీసు ఇన్‌ఛార్జి అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు నల్లపాడు పోలీసులు. తర్వాత సత్తెనపల్లి పర్యటనలో జగన్ ఉపయోగించిన బుల్లెట్ ప్రూఫ్ బ్లాక్ ఫార్చూనర్ AP 40 DH 2349 నంబర్ కారును పోలీసులు తీసుకెళ్లారు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సత్తెనపల్లి పర్యటనకు వెళ్లేటప్పుడు జగన్ కారు కింద సింగయ్యపడ్డారు. ఆయనను లాగి రోడ్డు పక్కన పడేసి అందరూ ఎవరి దారిన వారు పోయారు. పోలీసులకు వ్యూహాత్మకంగా తప్పుడు సమాచారం ఇచ్చారు. వేరే వాహనం ఢీకొన్నదని చెప్పారు. కానీ నాలుగు రోజుల తర్వాత వీడియోలు వెలుగులోకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కూడా తన వాహనం కిందనే పడినట్లుగా అదే రోజు తెలిసిందని ట్వీట్ చేశారు. కానీ వీడియోలు బయటకు వచ్చే వరకూ ఆయన మాట్లాడలేదు.
అప్పుడే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే సింగయ్య బతికి ఉండేవారన్న అభిప్రాయం ఉంది. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత ప్రకారం కఠినమైన సెక్షన్లు పెట్టారు. ఇప్పటికే జగన్ డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. A-2గా ఉన్న జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలవాల్సి ఉంది. నిబంధనలను ఉల్లంఘించి జగన్ ర్యాలీ చేశారు. పోలీసు సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదు. గాయపడిన కార్యకర్తను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. దీంతో ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తిగా మారింది.











