వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. లిక్కర్ స్కామ్‌లో భాగంగా వసూలు చేసిన సొమ్మును దేశం దాటించే వ్యవహారంలో చెవిరెడ్డికి కీలక పాత్రగా గుర్తించారు సిట్ అధికారులు.
ఐతే తాజాగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సిట్ నుంచి పిలుపు అందింది. ఈ మేరకు మోహిత్ రెడ్డికి నోటీసులు పంపింది సిట్. మోహిత్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించారని సిట్‌కు ఆధారాలు అందాయి. ఇతర దేశాల్లో ఆయన కొన్ని సర్దుబాట్లు చేసినట్టు విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను కూడా ఈ కేసులో A-39గా పేర్కొన్నారు. తాజాగా సోమవారం ఉదయం ఆయనకు నోటీసులు ఇచ్చారు.
అయితే.. సిట్ అధికారులు తనకు నోటీసులు ఇవ్వడం, అరెస్టు చేయడం ఖాయమని ముందుగానే ఊహించారు మోహిత్ రెడ్డి. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో పాటు..తనపై సిట్ నమోదు చేసిన కేసును కూడా కొట్టివేయాలని కోరారు. ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది. ఇంతలోనే సిట్ నోటీసులు ఇచ్చారు. మరోవైపు..మోహిత్ రెడ్డి నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి. దీంతో మోహిత్ రెడ్డిని అరెస్టు చేస్తారా లేదా కోర్టు ఏమైనా మినహాయింపులు ఇస్తుందా అనేది ఆసక్తిగా మారింది.











