ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బలి చేసే పరిణామం ఎదురుకాబోతోందని అంటున్నారు. బొత్స సత్యనారాయణ సొంత మేనల్లుడే ఆయనకు వెన్నుపోటు పొడవబోతున్నట్లుగా చెబుతున్నారు. జగన్ వేసిన ప్లాన్ ను బొత్స మేనల్లుడే నాశనం చేయబోతున్నాడనే వాదన వినిపిస్తోంది. అందుకు కారణాలను కూడా బలంగా చర్చించుకుంటున్నారు.
వైసీపీ హాయాంలో విద్యాశాఖకు మంత్రిగా పని చేసిన బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. చీపురుపల్లిలో టీడీపీ అభ్యర్థి చేతిలో ఎమ్మెల్యేగా ఘోర పరాజయం పొందారు. అయితే, ఆయనకు జగన్ రెడ్డి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. కాబట్టి, ఆ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ బొత్స సత్యనారాయణను ఎంపిక చేసింది. పార్టీ అధినేత జగన్ తో ఈ విషయమై చర్చించి తర్వాత బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ అధికారికంగా ప్రకటించింది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చెందిన పార్టీ నేతలతో జగన్ వరుసగా సమావేశమయ్యారు. అభ్యర్థి ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరం బొత్స సత్యనారాయణను పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్. అయితే, ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాగైనా గెలవాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకే ఎలాగైనా గెలిచి, పరువు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత కావడంతో బొత్సకు విశాఖకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సంబంధాలు ఉన్నాయి. ఇది తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.
అయితే, జగన్ ఆలోచన ఎలా ఉన్నా కూడా.. అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక, అందులోనూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవడం చాలా కష్టమే కాదు అసాధ్యమనే సంగతి ఆయనకు తెలియనిది కాదు. మరోవైపు, ఉత్తరాంధ్రలో బొత్స రాజకీయ స్థానాన్ని భర్తీ చేయాలని.. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీను ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వైసీపీ అధిష్ఠానం నుంచి ఆయనకు సరైన అవకాశం రావడం లేదు. గత ఎన్నికల్లోనూ బొత్స కుటుంబం నుంచి రెండో అవకాశం అయిన ఎంపీ టికెట్ ను బొత్స సతీమణి ఝాన్సీకే ఇచ్చారు. దీంతో డీలాపడ్డ మజ్జి శ్రీను.. ఇప్పుడు తెర వెనుక టీడీపీతో చేతులు కలిపి కోవర్ట్ ఆపరేషన్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఎలాగూ ఓడిపోబోయే బొత్స సత్యనారాయణకు సహకరిస్తే ప్రయోజనం ఏమీ లేనందున.. టీడీపీతో తెరవెనుక కోవర్ట్ గా పని చేస్తే ఆ వైపు నుంచి భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తుందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.










