జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన మెప్పు కోసం, ఆయన బాగు కోసం సీరియస్ గా పని చేసిన వారిలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఇన్ ఛార్జ్ ఎండీ ఒకరు. ఆయన పేరే వెంకటరెడ్డి. వైసీపీ పెద్దల మేలు కోసం ఏపీఎండీసీకి నష్టం కలిగేలా వెంకట్ రెడ్డి వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ పెద్దలకే కాక, కార్పొరేట్ సంస్థలకు కూడా అడ్డగోలుగా ప్రయోజనాలు కల్పించడం కోసం పని చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక ఆయన అవినీతి కార్యాలు బయటపడుతున్నాయి. బొగ్గు ప్రాజెక్టులు, ఇసుక టెండర్ల విషయంలో ఆయన అక్రమార్కులకు అందించిన సహకారం అంతా ఇంతా కాదు.
సులియారీలోని బొగ్గు ప్రాజెక్టు నుంచి బొగ్గు కొనుగోలు టెండరు దక్కించుకున్న అదానీ పవర్ సంస్థకు.. ఒప్పందం నుంచి మొదలుకొని అన్నింటా మేలు కలిగేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా సులియారీలోని 1,298 హెక్టార్లలో ఉన్న బొగ్గు గనిలో ఉత్పత్తయ్యే బొగ్గులో 75 శాతం అమ్మకాలకు 2021లో టెండరు పిలిచారు. బిడ్ దక్కించుకునే కాంట్రాక్టరు రూ.250 కోట్లు నగదు రూపంలో డిపాజిట్ చేయాలని ఎక్కడాలేని నిబంధనను వెంకటరెడ్డి అప్పట్లో పెట్టారు. దీంతో కేవలం 4 సంస్థలే బిడ్లువేయగా, బేసిక్ ధర కంటే 1 శాతం అదనంగా చెల్లించేలా కోట్ చేసి అదానీ పవర్ టెండరు దక్కించుకుంది.
టెండరు దక్కించుకునే సంస్థ ఫెర్ఫార్మెన్స్ గ్యారంటీగా చెల్లించే సొమ్మును నిబంధనల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తిచేశాకే వెనక్కి తీసుకోవాలి. కానీ వెంకటరెడ్డి మాత్రం.. అదానీ పవర్ డిపాజిట్ చేసిన రూ. 250 కోట్లను ప్రతి మూడు నెలలకు కొంత చొప్పున 10 త్రైమాసికాల్లో ఇచ్చేశారు. పైగా ఆ రూ.250 కోట్లు పెర్ఫార్మెన్స్ గ్యారంటీగా జమ చేస్తే.. దానిని ఏపీఎండీసీ వద్ద ఉంచకుండా, వెంటనే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీ)లో వెంకటరెడ్డి డిపాజిట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు సొమ్ము డిపాజిట్ చేయాలని అప్పటి సీఎం జగన్ సూచించగానే ఆయన వద్ద మెప్పు పొందేందుకు వెంకటరెడ్డి రూ.250 కోట్లు డిపాజిట్ చేశారు. ఆ కార్పొరేషన్ 5 శాతం చొప్పున వడ్డీ చెల్లించింది. కానీ, ఏపీఎండీసీ మాత్రం అదానీ పవర్‌కు మూడు నెలలకోసారి రూ.25 కోట్లు వెనక్కి ఇవ్వడంతోపాటు, 8.5 శాతం వడ్డీ ఇచ్చింది. ఇలా వడ్డీ రూపంలోనే దాదాపు రూ. 25-30 కోట్లు ఏపీఎండీసీపై భారం పడింది.
సులియారీ బొగ్గు విక్రయ టెండరులో అదానీ పవర్‌తో చేసుకున్న ఒప్పందం మొత్తం లోపాలమయం అని తెలిసింది. జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలకు విరుద్ధంగా వెంకటరెడ్డి ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఈ టెండరు గడువు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తే లోగుట్టు బయట పడే అవకాశం ఉంటుంది.










