వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలాకాలంగా పీఏగా వ్యవహరిస్తున్న కె.నాగేశ్వరరెడ్డిపై పోలీసు కేసు నమోదు అయ్యింది. నాగేశ్వరరెడ్డిని అంతా కేఎన్నార్ అని పిలుచుకుంటూ ఉంటారు. జగన్ వెంట నిత్యం తిరుగాడే ఇతగాడు జగన్ కు పీఏ కంటే కూడా ఎక్కువగా పనులు చేసి పెడుతూ ఉంటారని వైసీపీ వర్గాలే చెప్పుకుంటాయి. జగన్ తో ఏ పని కావాలన్నా ముందుగా కేఎన్నార్ ను కలవాలని, కేఎన్నార్ సరే అంటేనే జగన్ దర్శనం దొరుకుతందని, కేఎన్నార్ నై అంటే..జగన్ దరిదాపులకు కూడా వెళ్లలేరన్న వాదనా లేకపోలేదు. అంతేకాకుండా కేఎన్నార్ చెబితేనే జగన్ ఏ పని అయినా చేస్తారన్న వాదన కూడా ఉంది. అలాంటి కేఎన్నార్ పై ఇప్పుడు ఏకంగా పోలీసు కేసునమోదు అయిపోయింది. అది కూడా చీటింగ్ కేసు. జగన్ పీఏపై ఏకంగా చీటింగ్ కేసు నమోదు అయిన వ్యవహారం ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయింది.
ఈ వ్యవహారం గురించి కాస్తంత లోతుగా వెళితే… మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ సంగీతా మొబైల్స్ కు చెందిన బెంగళూరులోని రెండో స్టేజ్ స్టోర్ కు చెందిన మేనేజర్ రాజేశ్ ఫిర్యాదు మేరకు బసశంకరి పోలీస్ స్టేషన్ లో కేఎన్నార్ పై కేసు నమోదు అయ్యింది. జగన్ సీఎంగా ఉండగా… 2022లో ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడిన మధ్యప్రదేశ్ క్రికెటర్ రికీ భుయ్ కి స్పాన్సర్ చేయాల్సి ఉందంటూ కేఎన్నార్ నుంచి రాజేశ్ కు ఓ ఫోన్ కాల్ వెళ్లింది. ఈ కాల్ చేసిన వ్యక్తి తనను తాను జగన్ పీఏ కేఎన్నార్ గా పరిచయం చేసుకుని ఈ విషయం చెప్పాడట.
స్వయంగా జగన్ పీఏ నుంచి కాల్ రావడంతో… బెంగళూరులో జగన్ విన్యాసాలను గుర్తు చేసుకున్న రాజేశ్ అది నిజమేనని నమ్మారు. ఈ క్రమంలో 2022 మే నెల 10, 11 తేదీల్లో రెండు విడతలుగా మొత్తం రూ.10.40 లక్షలను కేఎన్నార్ చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు రాజేశ్ ఆ విషయాన్ని మరిచిపోయారు.
అయితే తమ సంస్థ ప్రమోషన్ వ్యవహారాల్లో బాగంగా సెలబ్రిటీలు అవసరమన్న భావనతో కేఎన్నార్ కు రాజేశ్ ఫోన్ చేయగా…ఆ నెంబర్ అందుబాటులోకి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన రాజేశ్… జగన్ సన్నిహితుల వద్ద ఈ విషయంపై ఆరా తీశారు. ఈ క్రమంలో జగన్ వద్ద కేఎన్నార్ అనే పేరున్న పీఏలు ఎవరూ లేరన్న విషయం తేలింది. తాను మోసపోయానని గ్రహించిన రాజేశ్… నేరుగా బసశంకరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్నివివరించారు. పోలీసుల సూచన మేరకు ఆయన జరిగిన వ్యవమారం మొత్తాన్ని ఓ ఫిర్యాదుగా అందజేశారు. దీంతో కేఎన్నార్ పేరిట మోసం జరిగిందంటూ బసశంకరి పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా రాజేశ్ కు ఈ కాల్ చేసింది ఎవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బసశంకరి పోలీసులు ఇదే మిప్టరీని చేధించే పనిలో పడిపోయారు.
వాస్తవానికి జగన్ సీఎంగా ఉండగా… ఆయన పేరు చెప్పుకుని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. జగన్ కు తెలిసి కొందరు స్వైర విహారం చేయగా… జగన్ కు తెలియకుండా ఇంకా చాలా మంది ఇలా అందినకాడికి దండుకున్నారన్న వాదనలు లేకపోలేదు. జగన్ జమానాలో అంతు లేని అక్రమాలుజరగగా… అవన్నీ వైసీపీ అదికారం నుంచి దిగిపోగానే… ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారాల్లో ఇప్పటికే చాలా మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి.
ఏపీలో జగన్ పేరిట జరుగుతున్న ఈ తరహా వ్యవహారాలను పరిశీలించిన వ్యక్తే… బెంగళూరులో మోసానికి తెర తీశారా?.. లేదంటే జగన్ వద్ద పనిచేసే వారే ఈ పని చేసి ఉంటారా? అన్నది ఆసక్తికురంగా మారింది. ఏపీలో రాజకీయాలు చేస్తున్నా… బెంగళూరు బేస్ గా జగన్ తన వ్యాపార సామ్రాజ్యంతో పాటుగా తన నివాసానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వీటన్నింటిపై అవగాహన ఉన్న వ్యక్తే సంగీతా మొబైల్స్ మేనేజర్ ను మోసం చేసి ఉంటాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.