అధికారం కోల్పోయిన అక్కసుతో జగన్ తానేమి చేస్తున్నారో తనకే తెలియడం లేదు. మొన్నటికి మొన్న..తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించారు. తర్వాత పొదిలిలో రైతులకు పరామర్శ పేరుతో రచ్చ చేశారు. ఇప్పుడు ఏడాది కింద సూసైడ్ చేసుకున్న వ్యక్తి కుటుంబానికి పరామర్శ పేరుతో జగన్ మరో రగడకు సిద్ధమయ్యారు. మొత్తంగా శాంతిభద్రతల సమస్య సృష్టించడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 21న యోగా డే సందర్భంగా ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ పర్యటన వెనుక అల్లర్లు సృష్టించాలనే దురుద్దేశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఏడాది క్రితం ఆత్మహ*త్య చేసుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న సర్వేలు నమ్మి, బెట్టింగులు పెట్టి, డబ్బులు పోగొట్టుకుని, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహ*త్యకు పాల్పడ్డారు. 2024 ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగులు జరిగిన సంగతి తెలిసిందే. నాగమల్లేశ్వరరావుతోపాటు సత్తెనపల్లికి చెందిన ప్రముఖ వైద్యుడొకరు..పెద్దమనుషులుగా ఉంటూ బెట్టింగ్ సొమ్ములను తమ దగ్గర ఉంచుకున్నారు. ఫలితాల తర్వాత..గెలిచిన వాళ్లకు వీళ్లే డబ్బు అప్పగించాలి.
అయితే ‘ఆరా’ మస్తాన్ సర్వే తర్వాత నాగమల్లేశ్వరరావుకూ ఆశ పుట్టింది. స్వయంగా వైసీపీ నాయకుడైన ఆయన.. మళ్లీ జగన్ సీఎం అవుతారంటూ కోటిన్నరకు పైగా సొమ్మును బెట్టింగ్‌లో పెట్టారు. ఇతర బెట్టింగ్‌రాయుళ్లు తన దగ్గర ఉంచిన డబ్బులతో పందెం కాశారు. వైసీపీ ఓడిపోవడంతో మొత్తం డబ్బు కోల్పోయారు. పందేలు వేసిన వారు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఇక గ్రామంలో తలెత్తుకొని తిరగలేనని భావించి, నాగమల్లేశ్వరరావు గత ఏడాది జూన్ 6న గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద పురుగు మందు తాగారు.
అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను..పోలీసులు సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత జూన్ 9న మర*ణించారు. స్థాయికి మించి కోట్లలో బెట్టింగ్‌లు కాయడమే ఆయన ఆత్మహ*త్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. అప్పులు తీర్చే మార్గం లేదనే ఆందోళనతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతారు. నాగమల్లేశ్వరరావు మర*ణం తర్వాత ఆయన భార్యాపిల్లలు కూడా గ్రామంలో ఉండట్లేదని, ఆమె పుట్టింట్లో ఉంటున్నట్టు తెలిసింది. అయినా జగన్ పరామర్శకు ఎందుకు వస్తున్నారోనని రెంటపాళ్లలో చర్చించుకుంటున్నారు.
నాగమల్లేశ్వరరావు ఆత్మహ*త్యకు పాల్పడింది గత ఏడాది జూన్ 6న. మరణించింది జూన్ 9న. కూటమి ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12న. అయినా ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహ*త్య చేసుకున్నారంటూ వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. నాగమల్లేశ్వరరావు విగ్రహం కూడా పెడుతున్నారు. దానిని ఆవిష్కరించేందుకే జగన్ బుధవారం రెంటపాళ్లకు వస్తున్నారు. చిన్న గ్రామం, ఇరుకైన వీధులు కావడంవల్ల… జగన్‌తోపాటు వందమంది మాత్రమే రావాలని పోలీసులు స్పష్టం చేసినా పట్టించుకోవడంలేదు. వేలమందిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. విశాఖ వేదికగా జరిగే యోగా దినోత్సవానికి ముందు రచ్చ చేసేందుకే జగన్ రెంటపాళ్ల పర్యటన పెట్టుకున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది.