దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు.. ఏపీ సీఎం జగన్ రెడ్డి చెల్లి అయిన వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. షర్మిల పొలిటికల్ ఎంట్రీపై పలు ఊహాగానాలు వచ్చాయి. అన్న జగన్ వదిలిన బాణామా.. టీఆర్ఎస్ ప్రయోగించిన అస్త్రమా.. అనే వార్తలు జోరుగా వినిపించాయి. నేను ఎవరి వదిలిన బాణం కాదని షర్మిల తేల్చి చెప్పారు. ఇతర పార్టీలతో సంబంధం లేకుండా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది వైఎస్ అభిమానులు, అనుచరులను కలుసుకున్నారు. నిరుద్యోగ కుటుంబాలను పరామర్శించారు. కొవిడ్ కుటుంబాలకు తనవంతు సాయం చేస్తూ తన ఉనికిని చాటుకున్నారు. షర్మిల ఏ జిల్లాకు వెళ్లినా.. ఏ ప్రెస్ మీట్ పెట్టినా.. కేసీఆర్ సర్కారు ను లక్ష్యం చేసుకుని ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. షర్మిల విమర్శలను టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన ఆమె, అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యర్థులమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ముమ్మరంగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ మధ్య నల్లగొండ, వికారాబాద్ జిల్లాలో పర్యటించిన ఆమె.. ఇప్పుడు ఏకంగా టీఆర్ఎస్ కంచుకోట అయిన కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
కరీంనగర్ టూర్ కు..
ఇవాళ వైఎస్ షర్మిల కరీంనగర్ టూర్ కు రెడీ అయ్యారు. తన నివాసమైన లోటస్ పాండ్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్ చేరుకొని చేనేత కుటుంబాలు, కరోనా తో చనిపోయిన కుటుంబాలను ఓదార్చనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఒంటిమామిడి, ప్రజ్ఙాపూర్, సిద్దిపేట్, సిరిసిల్ల, అల్మాస్‌పూర్, వేములవాడ బైపాస్ మీదుగా కరీంనగర్‌కు చేరుకుంటారు. అక్కడక్కడ వైఎస్ అభిమానులతో చర్చలు జరిపి కరీంనగర్ కు వెళ్తారు.
Must Read ;- దుస్తులు మార్చుకున్నంత ఈజీగా మాట మార్చే కేసీఆర్: షర్మిల