ఈటల రాజేందర్ రాజీనామా తరువాత హుజూరాబాద్‌లో రాజకీయ సమీకరణాల్లో మార్పులు వస్తున్నాయి. ఓవైపు ఆత్మగౌరవం పేరుతో ఈటల ప్రచారం చేస్తుండగా అభివృద్ధి పేరుతో నిధులు మంజూరు చేసి గెలిచి తీరాలని టీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది. అందులో భాగంగా అటు నాయకులు చేజారిపోకుండా చూడడంతో పాటు నిధుల మంజూరును కూడా వేగిరం చేసింది.
మంత్రుల పర్యటనలు..నిధుల మంజూరు
ఇటీవల ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకుని హుజూరాబాద్ వచ్చారు. తన అభిమానులను, నియోజకవర్గంలో తనవారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో కీలకంగా ఉన్న బీజేపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రస్తుతానికి సైలెంట్ కావడం, టీపీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి పార్టీ మార్పుపై ఊహానాగాలు,ఇక టీటీడీపీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఎల్ రమణ టీఆర్ఎస్‌లో చేరతారన్న ప్రచారం లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. అదే సమయంలో ముద్దసాని దామోదర రెడ్డి తమ్ముడు ముద్దసాని పురుషోత్తమ్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. టిక్కెట్ల విషయంలో ఇంకా చాలామంది రేసులో ఉండడంతో పాటు కొందరు నాయకుల వైఖరి విషయంలో క్లారిటీ రాలేదు. అయితే అధికార టీఆర్ఎస్ ఏ నాయకుడినీ హర్ట్ చేయకుండా టచ్‌లో ఉందని చెప్పవచ్చు. ఇక ఈటల వర్గంలో ఉన్న వారిని కూడా తమవైపు రప్పించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఈటల వర్గం చెబుతోంది.
రాజీనామా ఆమోదంతో ఆరునెలల్లోపు ఉప ఎన్నిక జరగడం ఖాయమైన నేపథ్యంలో నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన సతీమణి జమున కమలాపూర్ మండలంలో పర్యటించి ప్రచారం ప్రారంభించారని చెప్పవచ్చు.అదే సమయంలో టీఆర్‌ఎస్ కూడా పలువురు మంత్రులను రంగంలోకి దింపింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్ , గంగుల కమలాకర్‌లు గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
రూ.వందల కోట్ల మంజూరు
హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, పట్టణ అభివృద్ధికి ఒక్కొక మండలానికి 35కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుఈటల లు జారీ చేసింది. అంటే ఈ మూడు మండలాలకు కలిపి రూ.వంద కోట్లకుపైగా నిధులు విడుదలయ్యాయని చెప్పవచ్చు. రాష్ట్ర ఏర్పాటు తరవాత కేవలం హామీలకే పరిమితైన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఉన్న పనులకు నిధులు మంజూరు చేసింది. మానేరు నది సుందరీకరణ, నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.310 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హుజూరాబాద్ మున్సిపాలిటీకి రూ.35.52 కోట్లు
దీంతోపాటు హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.35.52 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల ప్రకటించారు. TUFIDC నిధులూ విడుదలయ్యాయి. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న తాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి రూ.8.75 కోట్లు, కరీంనగర్ – జమ్మికుంట (వయా ఎల్‌ఐసీ ఆఫీసు) వరకు సీసీరోడ్డు, మురుగుకాలువ నిర్మాణానికి రూ.1.27 కోట్లు, సైదాపూర్ క్రాసింగ్‌లో జంక్షన్ నిర్మాణానికి రూ.20 లక్షలు, ఆర్టీసీ డిపో క్రాసింగ్‌లో జంక్షన్ నిర్మాణానికి రూ.30 లక్షలు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా పట్టణంలోని 11 ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి రూ.25 కోట్లు విడుదల అయ్యాయి. ఈ పనులను మరో 15రోజుల్లోగా ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. మొత్తం మీద హూజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రానున్న కాలంలో మరిన్ని నిధులు మంజూరు అవుతాయని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు.
Must Read ;- ఈటల,కేసీఆర్ ఇద్దరూ ఒకే గూటి పక్షులు.. మావోయిస్టుల లేఖ