నవ్యాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి విపక్ష టీడీపీ చేస్తున్న వాదనలు అక్షరాలా నిజమేనన్న వాదనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ జగన్ అధికారంలోకి రాగానే వెనక్కెళ్లిపోతున్నాయని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా విశాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్… తాజాగా వెనక్కు వెళ్లిపోతున్న వైనాన్ని ఆ పార్టీ ప్రబల ఉదాహరణగా చూపింది. ఇప్పుడు అంతకంటే మరింత ఆసక్తికరమైన ఉదాహరణగా నిలిచిపోయే ఉదంతం ఒకటి వెలుగు చూసింది. తిరుపతిలో సెట్ టాప్ బాక్సులు, ఇయర్ బడ్స్ ఉత్తత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిన దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ ప్లాంట్ ఏర్పాటు యోచనను విరమించుకుందట. ఈ విషయాన్ని జగన్ సర్కారే స్వయంగా వెల్లడించడం గమనార్హం.
బాబు పాలసీతో కార్పొరేట్ల క్యూ
13 జిల్లాలతో తీవ్రమైన ఆర్థిక లోటుతో కొత్త ప్రయాణం ప్రారంభించిన నవ్యాంధ్రను వీలయినంత త్వరలో కష్టాల బాట నుంచి గట్టెక్కించాలని 2014 నవ్యాంధ్ర పాలనా పగ్గాలను చేపట్టిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పరితపించారు. అందుబాటులో ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరిచారు. ప్రపంచంలోనే పేరుగాంచిన కార్పొరేట్లు ఏపీ వైపు దృష్టి సారించేలా కొత్త పారిశ్రామిక పాలసీని ప్రకటించారు. ఫలితంగా చాలా మంది కార్పొరేట్లు ఏపీలో తమ యూనిట్లు నెలకొల్పే దిశగా దృష్టి సారించారు. ఇందులో దేశీయంగా బలమైన కార్పొరేట్ దిగ్గజంగా రూపుదిద్దుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఒకటి.
రిలయన్స్ కు 136 ఎకరాలు కేటాయించిన బాబు
ఎలక్ట్రానిక్ హబ్ గా తిరుపతిని మారుస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో తిరుపతి పరధిలో ఏ తరహా ఇండస్ట్రీ అయితే బాగుంటుందన్న విషయంపై దృష్టి సారించిన రిలయన్స్… సెట్ టాప్ బాక్సులు, ఇయర్ బడ్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీకి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు రిలయన్స్ ఏపీ ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపగా… తిరుపతి పరిధిలో 130 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు కేటాయించింది. ఇక రిలయన్స్ తన ప్లాంట్ ను ఏర్పాటు చేయడమే ఆలస్యమన్న సమయంలో ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, ఒక్క ఛాన్స్ అంటూ జనంలోకి వెళ్లిన జగన్ గెలవడం జరిగిపోయింది. జగన్ సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి దాదాపుగా పడకేసిందన్న వాదనలు వినిపించాయి. ఆ వాదనలు నిజమేనన్న రీతిలో విశాఖలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిన ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఇటీవలే వెనక్కెళ్లిపోయింది.
వెళ్లిపోతుంటే ఇంత ఆనందమెందుకో?
తాజాగా తిరుపతిలో ప్లాంట్ ఏర్పాటు ఆలోచనను విరమించుకున్నట్టుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో తమకు కేటాయించిన 136 ఎకరాల భూమిలో జగన్ అధికారంలోకి వచ్చాక తమకు అప్పగించిన 75 ఎకాలను వెనక్కు తీసుకోవాలంటూ లేఖ రాసింది. ఈ లేఖకు ఏమాత్రం ఆలస్యం చేయకుండానే ఏపీ సర్కారు ఆమోద ముద్ర వేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి సంస్థ దృష్టి పడితే చాలనుకునే ప్రస్తుత తరుణంలో ఆ సంస్థ ప్లాంట్ కోసం అప్పగించిన భూములను వెనక్కు తీసుకునేందుకు మరు ఆలోచన లేకుండానే ఓకే చెప్పేసిన జగన్ సర్కారు.. రాష్ట్రాన్ని ఏ రీతిన పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తుందోనన్న వాదనలు వినిపిస్తున్నాయి. రిలయన్స్ తనకు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ఏపీఐఐసీ అధికారులు స్వయంగా వెల్లడించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రిలయన్స్ వెళ్లిపోతున్నా… సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తున్న ఏపీఐఐసీకి చైర్ పర్సన్ గా చిత్తూరు జిల్లాకే చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కొనసాగుతుండటం కొసమెరుపు.
Must Read ;- పరిశ్రమ చంద్రబాబుది.. ప్రచారం జగన్‌ది: నారా లోకేష్










