గతంలో చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలుచేసే బాధ్యత ప్రభుత్వానిదేనని అని చెప్పిన సీఎం కేసీఆర్ దుస్తులు మార్చుకున్నంత ఈజీగా ఇప్పుడు మాట మార్చుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. పరిగి నియోజకవర్గం పరిధిలోని దోమ మండలం పోలేపల్లి ఇతర గ్రామాల్లో షర్మిల ఈ రోజు పర్యటించి ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తెలుసుకున్నారు.
షర్మిల కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత్త..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షాల కారణంగా రైతులను పరమర్శించేందుకు వెళ్తున్న వైఎస్ షర్మిల కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రికత్త పరిస్థితి తలెత్తింది. చివరికి పోలీసులు షర్మిల పర్యటనకు అనుమతించారు. షర్మిల లోటస్‌పాండ్ నివాసం నుంచి కారులో పరిగికి బయలు దేరగా చేవెళ్లలోని చింతపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం అంతమంది వెళ్లేందుకు వీల్లేదని, అందుకే అడ్డుకుంటున్నామని, ఈ పరిస్థితుల్లో అనుమతివ్వలేమని చెప్పారు. దీంతో షర్మిల పార్టీ అనుచరులు ఆందోళన చెపట్టడంతో ఆ మార్గంలో కాసేపు రాకపోకలు స్తంభించాయి. ఆ పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, ఇందిరాశోభన్ తదితరులు పోలీసులతో చర్చలు జరిపారు. తాము ఈ పర్యటనకు ఎవరినీ ఆహ్వానించలేదని, జనాలను సమీకరించలేదని, ఎవరికి వారుగా వస్తున్నారని చెప్పారు. అయితే ర్యాలీగా తరలి వెళ్లడానికి అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పడంతో పోలీసుల సూచనలు పాటిస్తూనే వైఎస్ షర్మిల పర్యటిస్తారని హామీ ఇవ్వడంతో అనుమతించారు. పరిగిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన షర్మిల పరిగి నియోజకవర్గం పరిధిలోని దోమ మండలం పోలేపల్లి, ఇతర గ్రామాల్లో పర్యటించారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు.
Must Read ;- టీఆర్ఎస్ మౌన వ్యూహం.. షర్మిల ఎవరు వదిలిన బాణం
రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకోని కేసీఆర్
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ నివారించలేరని, అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాలని కోరారు. తడిచిన పంటను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు చెబుతున్నారని, తడిచిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తెలంగాణలో రైతులు గుండెలు బాదుకునేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. తేమ శాతం, తాలు నిబంధనలు చెప్పి రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం చొరవతీసుకోవాలని కోరారు.
కొవిడ్, ధాన్యం కొనుగోలు ప్రధాన సమస్యలు
తెలంగాణలో కొవిడ్, ధాన్యం కొనుగోలు అంశాలే రెండు నెలలుగా ప్రధాన సమస్యలుగా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని, ఈ రెండు అంశాల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలుచేసే బాధ్యత ప్రభుత్వానిదేనని గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పంట నష్టం జరిగితే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పుడు ముఖం చాటేయడాన్ని తప్పు బట్టారు. దుస్తులు మార్చుకున్నంత ఈజీగా సీఎం కేసీఆర్ మాట మార్చుతున్నారని వ్యాఖ్యానించారు. జూన్‌లో వానలు పడతాయని 80 వేల పుస్తకాలు చదివానని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ రైతు ద్రోహిగా మారారని విమర్శించారు. గతంలో 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పారని, ఇప్పుడు 20రోజులు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని, రైతు బంధు అమలు చేస్తున్నామని చెబుతున్నారని, అయితే ఆ రైతు బంధు పథకం ద్వారా ఇచ్చే డబ్బులు రైతులకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేస్తాయా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా రైతుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుంటే రానున్న కాలంలో మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పారు.
Also Read ;- షర్మిల పార్టీ YSRTP.. కాని ఎన్నో సందేహాలు











